ముఖ్యాంశాలు

  • పోలీసులపై దాడికి నక్సల్స్ కొత్త వ్యూహాలు
  • రెడ్ కారిడార్ లో ఉనికిని చాటుకునే ప్రయత్నం
  • కోళ్లపందేల్లో దాడులకు సరికొత్త వ్యూహాలు

ఛత్తీస్ ఘడ్ లో నక్సల్స్ భద్రతాదళాలమీద దాడిచేసేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం ఇచ్చాయి. రెడ్ జోన్ లో తమ కార్యకలాపాలను విస్తృత స్థాయిలో పెంచడంద్వారా ఉనికిని చాటుకునేందుకు నక్సల్స్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. తాజాగా ఇంటెలిజెన్స్ వర్గాలు నక్సల్స్ కొత్త పద్ధతుల్లో, కొత్త మార్గాల్లో దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్న విషయాన్ని తెలిపి అధికారులను అప్రమత్తం చేశాయి.

ముఖ్యంగా ఇన్ఫార్మర్లు నక్సల్స్ టార్గెట్ లో ముందు వరసలో ఉన్నట్టు సమాచారం. స్థానికులు కోడి పందాలను ఏర్పాటు చేసినప్పుడు ఇన్ఫార్మర్లుగా ఉన్న అండర్ కవర్ సిబ్బంది వాటిని చూసేందుకు వెళ్తే నక్సల్స్ అదనుచూసి దాడిచేసి ప్రాణాలు తీయాలని చూస్తున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందినట్టుగా తెలుస్తోంది.

ఈ కారణంగా ఇన్ఫార్మర్లు, అండర్ కాప్ లు మార్కెట్లు, స్థానికులు ఉండే ప్రాంతాలకు, కోడి పందాలు జరిగే ప్రాంతాలకు వెళ్లకూడదని ఉన్నతాధికారులనుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ సీజన్ లో చత్తీస్ ఘడ్ లో పెద్ద ఎత్తున స్థానికులు కోడి పందాలు నిర్వహిస్తారు. ఇదికాక చికెన్ వ్యాపారులద్వారా పెద్ద ఎత్తున ఆయుధాలు చేతులు మారుతున్నట్టుగా సమాచారం.

ఇంటెలిజెన్స్ వర్గాలకు అందిన విశ్వసనీయమైన సమాచారం ప్రకారం స్థానికంగా చికెన్ అమ్మే షాపులద్వారా చిన్న చిన్న సంచుల్లో నక్సల్స్ ఆయుధాలను, పేలుడు పదార్థాలను సేకరిస్తున్నట్టు సమాచారం. స్థానికంగా ఉన్న చికెన్ సెల్లర్స్ ద్వారా పెద్ద ఎత్తున ఇలా చిన్న మొత్తాల్లో నక్సల్స్ కు ఆయుధాలు, పేలుడు సామాగ్రి, ఇతరత్రా ఎలక్ట్రానిక్ పరికరాలు అందుతున్నట్టుగా పక్కా సమాచారం అందింది.

చికెన్ మార్కెట్లకు కోళ్లను సరఫరా చేసే వ్యక్తుల రూపంలో ఉన్న అనుమానితులైన వ్యక్తులపై నిఘాను బాగా పెంచారు. వారాంతాల్లో పెద్ద ఎత్తున ఇక్కడ చికెన్ వ్యాపారం జరుగుతుంది. చిన్న చిన్న సంతలమాదిరిగా చికెన్ తో పాటుగా ఆహారపదార్థాలను అమ్మడం ఎన్నో ఏళ్లుగా వస్తున్న అలవాటు. ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టూ యానిమల్స్ చట్టం 1960 ప్రకారం కోడి పందేలను నిషేధించారు.

అయినప్పటికీ ఏన్నో శతాబ్దాలుగా ఆచారంగా ఉన్న ఈ కోడి పందేలను స్థానికులు పెద్ద ఎత్తున నిర్వహిస్తూనే ఉంటారు. వాళ్లకు ఇది ప్రధానమైన వినోద సాధనం. ఈ కోడి పందేలకోసం రాష్ట్రం నలుమూలలనుంచీ పెద్ద ఎత్తున జనం తరలివస్తారు. ఒక్కో బెట్ పదినుంచి పదిహేను నిమిషాలపాటు సాగుతుంది. ఈ సమయంలో పెద్ద ఎత్తున డబ్బు పందేల రూపంలో చేతులు మారుతుంది. చిన్న చిన్న మొత్తాలుగా పోగై పెద్ద మొత్తంగా చేతికి అందే ఈ డబ్బును సొంతం చేసుకునేందుకు స్థానికులు పెద్దఎత్తున ఆసక్తిని చూపిస్తారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.