ముఖ్యాంశాలు

  • ఆడ‌బిడ్డ ఎదుర్కొంటున్న క‌ష్టాలు అన్నీ..ఇన్నీ కావు

  • త‌ల్లి గ‌ర్భంలో పెరుగుతున్న‌ది ఆడ‌పిల్ల అని తెలిస్తే అంత‌మొందిస్తున్నారు

  • నేడు జాతీయ బాలికా దినోత్సవం

తల్లి గర్భంలో నలుసుగా పడింది మొదలు మన దేశంలో ఆడబిడ్డ ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ రోజుల్లో కూడా భ్రూణ హత్య దశను దాటి భూమిఫై పడింది మొదలు ఆడపిల్ల అడుగడుగునా విచక్షణ ఎదుర్కొంటున్న తీరు అత్యంత బాధాకరం. దీనికి కారణం సమాజ మూలమూలల్లో స్థిరపడ్డ పురుషస్వామ్య సంస్కృతి ఒక కారణం అయితే, అడవారికే ఆడవాళ్లే శత్రువులు అన్న రీతిలో ఇతర ఆడవాళ్లు కొంత వరకు కారణం అవుతున్నారు. ఈ విషయంపై సామాజిక అవగాహన పెంచి పీడన నుండి బాలికలకు విముక్తి కలిగించేందుకు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నా ఆశించిన ఫలితం దక్కడం లేదు. ఈ అవగాహనను మరింతగా పెంచేందుకు భాగంగా, మన దేశంలో ఏటా జనవరి 24న ‘జాతీయ బాలికా దినోత్సవం’గా నిర్వహిస్తున్నారు.

ఆడ పిల్ల పుడితే మ‌న‌సులో తెలియ‌ని బాధ‌… ఆ క్ష‌ణ‌మే నిట్టూర్పు

ఒకప్పుడు ఆడపిల్ల పుడితే మహలక్ష్మి పుట్టిందని ఆనందించే వారు. కాని ఇప్పుడు ఆడ పిల్ల పుడితే మనసులో ఏదో తెలియని బాధ .. ఆ క్షణమే అయ్యో ఆడపిల్ల పుట్టిందా అనే నిట్టూర్పు.. నేటి కాలంలో ఆడపిల్ల పుట్టకముందు నుండే వివక్ష చూపుతున్నారు. పుట్టాక అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ‘నేషనల్ గర్ల్స్ డెవలప్ మెంట్ మిషన్‘ పేరుతో గతంలో ఆడపిల్లలపై ప్రత్యేక దృష్టిసారించింది. అందులో భాగంగానే స్త్రీ, శిశు సంక్షేమ శాఖ 2008 నుండి భారత జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. మోడీ ప్రభుత్వం కుడా ఈ విషయంపై పూర్తి బాధ్యత తీసుకుంది. అందులో భాగంగానే బేటి బచావో బేటి పడావో ప‌థ‌కాన్ని ప్రవేశపెట్టారు.

భ్రూణ హ‌త్య‌లు 

భ్రూణ హత్యలు.. తల్లిగర్భంలో పెరుగుతున్నది ఆడపిల్ల అని తెలిస్తేనే ఆ ఆడశిశువును అంతమొందిస్తున్నారు. ఆ అంతరాన్ని దాటి కళ్లు తెరిచి భూమ్మీదకి వచ్చినా ఆ అమ్మాయి అడుగడుగునా వివక్షకు గుర‌వుతుంది. నేడు ఆడపిల్లల భ్రూణహత్యలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఫలితంగా తాజా జనగణన లెక్కల్లోనూ స్త్రీ, పురుష నిష్పత్తిలో అనూహ్యమైన తేడా కనిపిస్తోంది.

చదువులోనూ తప్పని వివక్ష…

ఆడపిల్లలకు అందించే విద్యావకాశాలు కూడా దయనీయంగా ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ భారతంలో ఆడపిల్లల చదువులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. మగపిల్లలతో వారిని పాఠశాలల్లో చేర్పించినా, కుటుంబ ఆర్థిక అవసరాల కోసమో, ఇతర బాధ్యతలు నెరవేర్చడం కోసమో ఆడపిల్లలను చదువుకు దూరం చేస్తున్నారు.

నేటికి ఆడ‌పిల్ల‌లు ఎదుర్కొంటున్న ప్ర‌ధాన స‌మ‌స్య

నేటికీ ఆడపిల్లలు ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్య పోషకాహార లోపం. కుటుంబ ఆర్థిక సమస్యలతో ఏదో ఒక పనిచేసి కడుపు నింపుకోవాల్సిన దుస్థితి వస్తోంది. ఉన్న ఊర్లో పనులు దొరకక వలసలు పోతున్న ఆడపిల్లలు, అక్కడా రక్షణ లేక లైంగిక దాడుల బారిన పడుతున్నారు. ఆడ పిల్లలు కనిపించకుండా పోతున్న వారి సంఖ్య వందల సంఖ్యల్లో ఉంది. సామాజిక, ఆర్థిక పరిస్థితిల్లో వచ్చిన మార్పుల ఫలితంగా బాలికలంటే కేవలం కట్నం తెచ్చే యంత్రంగానే పరిగణిస్తున్నారు. దాంతో ఆడపిల్లల పెళ్లిళ్లు భారంగా మారాయి.

చిన్న వ‌య‌సులోనే మాతృమూర్తులు

ఈ కాలంలో ఆడ పిల్ల అంటేనే కుటుంబానికి భారంగా భావిస్తున్నారు. ఆడ పిల్ల అంటేనే క‌ట్న‌కానుక‌లు తీసుకువ‌చ్చేది కాదు…తీసుకుపోయేది అనే రీతిలో ఆలోచిస్తున్నారు. దీంతో పేద తల్లిదండ్రులు తప్పని పరిస్థితుల్లో చిన్న వ‌య‌స్సులోనే పెళ్లిళ్లు చేస్తున్నారు. దాంతో వారు అతి చిన్న వయస్సులోనే మాతృమూర్తులుగా మారుతున్నారు. ఫలితంగా భవిష్యత్తులో అనేకరకాల ఆరోగ్యసమస్యల బారిన పడుతున్నారు.

లైంగిక దాడులు

దేశంలో ఆడ పిల్లలపై లైంగిక దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మైనర్‌గా ఉన్న సమయంలో కామాంధులకు బలైపోతున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు ఎవ్వరికి వదలకుండా కామాంధులు నీచానికి ఒడిగడుతున్నారు. ఆడ పిల్లలపై దారుణాలు జరుకుండా ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా..? ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఒక వైపు ఆడ పిల్ల పుడితే భారంగా మారుతుందనుకుంటుండగా, మరో వైపు ఆడ పిల్ల పుడితే రక్షణ లేకుండా పోతోంది. ఆడ పిల్ల పుడితే ఎన్ని జాగ్రత్తలు తీసుకుని పెంచినా.. రక్షణ లేకుండా పోతుందనేది ప్రస్తుత సమాజంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గతంలో ఢిల్లీలో నిర్భయ, తెలంగాణలో దిశ ఘటన.. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో దారుణాలు వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి సమయాల్లో ఆడ పిల్ల పుట్టిందంటే చాలు సమాజంలో బతకాలంటే భయపడే రోజులొచ్చేశాయి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.