స‌స్పెండైన డాక్ట‌ర్ సుధాక‌ర్ ఎపిపోడ్‌తో హీటెక్కిన ఏపీ రాజ‌కీయం..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 May 2020 2:01 AM GMT
స‌స్పెండైన డాక్ట‌ర్ సుధాక‌ర్ ఎపిపోడ్‌తో హీటెక్కిన ఏపీ రాజ‌కీయం..

ఏపీలో నర్సీపట్నం ప్ర‌భుత్వ‌ ఆసుపత్రికి చెందిన సస్పెండెడ్‌ ఎనస్ధీషియా డాక్టర్‌ సుధాకర్ ఎపిసోడ్ నిన్న‌టి నుండి క‌ల‌క‌లం రేపుతుంది. న‌ర్సీప‌ట్నం ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేవంటూ.. తనకు మాస్కులు, పీపీఈ కిట్లు అంద‌చేయ‌లేదంటూ.. సుధాకర్ ప్రభుత్వంపై విమ‌ర్శ‌లు చేయగా.. వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్ట‌ర్ సుధాక‌ర్‌ను స‌స్పెండ్ చేసిన ‌సంగ‌తి తెలిసిందే.

డా. సుధాకర్ శ‌నివారం మ‌ద్యాహ్నం మ‌ద్యం సేవించి నడిరోడ్డుపై అర్థ‌న‌గ్నంగా క‌నిపించారు. ఈ నేఫ‌థ్యంలో డాక్ట‌ర్ సుధాక‌ర్ అనుచితంగా ప్ర‌వ‌రిస్తున్నారంటూ.. 100 ద్వారా పోలీసుల‌కు ఫిర్యాదులు రాగానే.. విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ పోలీసులు అప్పటికే పుల్లుగా మ‌ద్యం తాగి ఉన్న‌ సుధాక‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆయ‌న‌ను అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.

ఈ విష‌య‌మై డాక్ట‌ర్ సుధాక‌ర్ మాట్లాడుతూ.. లోన్ కట్టడానికి వెళుతున్న న‌న్ను పోలీసులు వేధిస్తున్నార‌ని.. ప్ర‌భుత్వాన్ని ఎన్‌-95 మాస్క్ అడిగినందుకే ఇలా చేస్తున్నార‌ని.. న‌న్ను తాళ్ల‌తో బంధించి నా వ‌ద్ద ఉన్న డ‌బ్బు, సెల్‌ఫోన్‌ను పోలీసులు లాక్కున్నారని అన్నారు.

ఈ విష‌య‌మై విశాఖ సీపీ ఆర్కే మీనా మీడియాతో మాట్లాడుతూ.. మ‌ద్యం సేవించి అనుచితంగా ప్ర‌వ‌ర్తించార‌నే ఫిర్యాదు మేర‌కు ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్నామ‌ని అన్నారు. మ‌ద్యం మ‌త్తులో ఉన్న ఆయ‌న‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించామ‌ని.. ఈ ఘటనలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశామ‌ని మీడియాకు తెలిపారు.

ఇక ఈ విష‌య‌మై ప్ర‌తిప‌క్షాలు ప్ర‌భుత్వంపై, పోలీసుల తీరుపై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి. డాక్టర్‌ సుధాకర్‌ రోడ్డుపై అర్ధనగ్నంగా నిరసనకు దిగార‌ని.. నిర‌స‌న తెలుపుతున్న ఆయ‌న‌ను ట్రాఫిక్ పోలీసులు తాళ్లుకట్టి పోలీస్‌స్టేషన్‌కు తరలించడాన్ని ఖండించాయి. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీమంత్రి నారా లోకేష్‌తో పాటు పలు పార్టీలకు చెందిన నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

Next Story
Share it