అందరూ తనలా జైలుకి వెళ్లాలని కోరుకోవడం సహజమే : నారా లోకేష్

By రాణి  Published on  14 Feb 2020 12:24 PM GMT
అందరూ తనలా జైలుకి వెళ్లాలని కోరుకోవడం సహజమే : నారా లోకేష్

  • జగన్ అవినీతిపై లోకేష్ ట్వీట్ల వర్షం

టీడీపీ నేత నారా లోకేష్ మరోసారి ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకు పడ్డారు. గత ప్రభుత్వం చేసిన పనులతో పోలిస్తే..ఈ ప్రభుత్వం ప్రజలకు మేలు కన్నా కీడే ఎక్కువ తలపెడుతుందని విమర్శలు చేశారు.

'' చంద్రబాబు గారి హయాంలో ఒక్క ఉద్యోగం కూడా రాలేదు అంటూ అసత్యాల యాత్ర చేసిన @ysjagan గారు ఇప్పుడు ఒక్కొక్కటిగా నిజాలు బయటపెడుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో బాబు గారి హయాంలో రాష్ట్ర యువతకి 9,56,263 ఉద్యోగాలు వచ్చాయని అసెంబ్లీ సాక్షిగా నిజాన్ని ఒప్పుకున్నారు. పరిశ్రమల ద్వారా 5,13,351 ఉద్యోగాలు, ఐటీ శాఖ ద్వారా 30,428 ఉద్యోగాలు, అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్న 137 కంపెనీల ద్వారా 2,78,586 ఉద్యోగాలు వచ్చాయని వైకాపా ప్రభుత్వం బల్ల గుద్ది మరీ చెప్పింది. ఇప్పుడు ఇండస్ట్రియల్ డెవెలప్మెంట్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ పేరుతో వైకాపా ప్రభుత్వం రూపొందించిన పాలసీలో టిడిపి హయాంలో 2.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 3.51 లక్షల ఉద్యోగాలు ఒక్క ఉత్పత్తి రంగంలోనే వచ్చినట్టు ప్రకటించారు. ఇవన్నీ వైకాపాలా కార్యకర్తలకు దొడ్డి దారిలో ఇచ్చిన ఉద్యోగాలు కావు. నిరుద్యోగ యువత కి బాబు ఇచ్చిన జాబులు..'' అని ట్వీట్ల వర్షం కురింపించారు.



టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పై జరిగిన ఐటీ దాడులపై స్పందిస్తూ..అలాగే పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు జగన్ అవినీతిపరుడని ఆయనకు లోకమంతా అవినీతిగా కనిపించడంలో పెద్దగా ఆశ్చర్య పడాల్సిందేమీ లేదన్నారు.

''పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు @ysjagan గారికి లోకమంతా అవినీతి కనపడటంలో పెద్దగా ఆశ్చర్యం ఏమి లేదు. ఐటీ రైడ్స్ లో కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు వారు ఇచ్చిన పత్రికా ప్రకటన ద్వారానే అర్ధమైంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 40 చోట్ల సోదాలు నిర్వహిస్తే 85 లక్షలు దొరికాయి అని ఐటీ శాఖ అంటుంటే చంద్రబాబు గారి మాజీ పీఎస్ ఇంట్లో 2 వేల కోట్లు దొరికాయి అని తప్పుడు ప్రచారం చేస్తూ వైకాపా నాయకులు శునకానందం పొందుతున్నారు. రావాలి జగన్ కావాలి జగన్ అని జైలు పిలుస్తుంది అన్న భయం జగన్ గారిని వెంటాడుతోంది. అందుకే ఇన్ఫ్రా కంపెనీల్లో జరిగిన ఐటీ రైడ్స్ కి టిడిపి కి ముడి పెట్టాలని తెగ తాపత్రయపడుతున్నారు. ఇన్ఫ్రా కంపెనీల్లో అక్రమాలు జరిగినట్టు తేలితే విచారణ జరిపి చర్యలు తీసుకుంటారు. ఆ కంపెనీల్లో జరిగిన రైడ్స్ కి టిడిపి కి ముడిపెట్టి అసత్యాలను ప్రచారం చేస్తున్నారు.16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి అందరూ తనలా జైలుకి వెళ్లాలని కోరుకోవడం సహజమే అయినా అలాంటి కోరికలు మాకు లేవు..'' అని ట్వీట్ల రూపంలో జగన్ పై విమర్శలు చేశారు.



Next Story