నాగోబా జాతరలో కొత్త కోడళ్ల ప్రత్యేక పూజలు

By అంజి  Published on  26 Jan 2020 7:28 AM GMT
నాగోబా జాతరలో కొత్త కోడళ్ల ప్రత్యేక పూజలు

ముఖ్యాంశాలు

  • నాగోబాకు కొత్త కోడళ్ల ప్రత్యేక పూజలు
  • బేటింగ్ పేరుతో ప్రసిద్ధమైన పురాతన సంప్రదాయం
  • వారం రోజులపాటు ఆలయంలోనే ఉండే కొత్త కోడళ్లు
  • కొత్త అల్లుళ్లకూ ఈ నియమం వర్తిస్తుంది
  • తెల్లటి వస్త్రాలను ధరించి ఆలయ ప్రాంగణంలోనే ఉండాలి
  • మర్రిచెట్ల నీడలోనే తిండీ తిప్పలు, నిద్ర, జీవనం
  • ఇలా చేయడంవల్ల పవిత్రులవుతారని నమ్మకం
  • అదృష్టయోగం పడుతుందని గిరిజనుల విశ్వాసం
  • నాగోబాకు నివేదించనిదే ఏ పనీ చేయని గిరిజనులు

ఆదిలాబాద్‌: కొత్త కోడళ్లను, అల్లుళ్లను తీసుకెల్లి నాగోబాకు పరిచయం చేసిన తర్వాతే తమ కుటుంబాల్లో కలుపుకోవడం ఏటా తెలంగాణలో వారం రోజుల పాటు పెద్ద ఎత్తున జరిగే నాగోబా జాతరలో కనిపించే విశేషం. ఇలా ఈ సంవత్సరం నాగోబా జాతరకు మొదటిరోజునే దాదాపుగా రెండు వందలమంది కొత్త కోడళ్లు తరలివచ్చారు.

కొత్త కోడళ్లు, కొత్త అల్లుళ్లు ప్రత్యేకంగా తెల్లటి వస్త్రాలను ధరించి నాగోబాను సేవించుకునేందుకు కెస్లాపూర్ కి వస్తారు. వారం రోజులపాటు వీరిలో ఎవరూ స్నానం చెయ్యరు. ఈ వారం రోజులపాటూ ఆలయాన్ని విడిచిపెట్టి పోరు. ఇక్కడే ఉన్న మర్రి చెట్లకింద సకల సంభారాలను తెచ్చుకుని ప్రసాదాలు వండుకుని, దాన్ని నాగోబాకు సమర్పించి ఆయన అనుగ్రహించిన ప్రసాదాన్ని స్వీకరిస్తూ వారం రోజులపాటు అలాగే గడిపేస్తారు.

బేటింగ్ పేరుతో సుప్రసిద్ధమైన ఈ ప్రక్రియ ఈ నాగోబా జాతరకు హాజరయ్యే గిరిజన కుటుంబాలకు అత్యంత ముఖ్యమైది. కొత్త కోడళ్లు, కొత్త అల్లుళ్లు నాగోబాను దర్శించి అనుమతి స్వీకరించిన తర్వాతే తమ కుటుంబాల్లో భాగస్తులవుతారని గిరిజనులు బలంగా విశ్వసిస్తారు.

ఇలా చేయడంవల్ల కొత్తగా వచ్చేవాళ్లకు ఉన్న ఇబ్బందులు సబ్బందులు, జాతక దోషాలు, రోగాలు పూర్తిగా నశించిపోతాయనీ, అదృష్టం వరిస్తుందనీ, తర్వాత వాళ్లు తమ కుటుంబాల్లో కలిసినప్పుడు ఆ అదృష్టం తమకుకూడా పడుతుందనీ గిరిజనలు బలంగా విశ్వసిస్తారు.

ఇలా చేయకపోతే కొత్తగా వచ్చిన వాళ్లకు ఉన్న దోషాలు తమ కుటుంబానికి కూడా అంటుతాయని గిరిజనులు బలంగా నమ్ముతారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది వాళ్ల దృష్టిలో పవిత్రీకరణ లేదా శుద్ధీకరణ ప్రక్రియన్నమాట. ఇలా జాతరలో తమ కులదైవాన్ని సేవించుకున్నవారందరూ శారీరకంగా, మానసికంగా పవిత్రులవుతారని వారి ప్రగాఢ విశ్వాసం.

నాగోబా జాతర మొదలైననాటినుంచీ వైస్రం వంశానికి చెందిన కొత్త కోడళ్లందరూ వారం రోజులపాటు ఈ నాగోబా ఆలయంలోనే ఉండి ప్రత్యేక పూజలు చేయడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. గోండుల తెగకు చెందిన గిరిజనలు ప్రత్యేకంగా నాగోబాను తమ కుల దైవంగా భావిస్తారు.

నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి.ఇది వారం రోజులపాటు జరుగుతుంది. సర్పజాతిని పూజించడమే ఈ పండగ ప్రత్యేకత. అమావాస్యరోజు తమ ఆరాధ్య దైవమైన నాగోబా అంటే శేషనారాయణమూర్తి పడగవిప్పి నాట్యం చేస్తాడనీ, ఆ సమయంలో స్వామి అత్యంత ప్రసన్నుడై ఉంటడనీ, గిరిజన పూజాలకు దర్శనమిచ్చి, వాళ్లు నైవేద్యంగా సమర్పించిన పాలను స్వీకరించి ఆశీర్వదిస్తాడనీ గిరిజనుల విశ్వాసం.

పక్క రాష్ట్రాల నుంచి కూడా..

నాగోబా గోండుల దేవుడు. ఆదిమ గిరిజనులైన మేస్రం వంశీయుల ఆరాధ్యదైవం. నాగోబాని దర్శించిన తర్వాతే కొత్త కోడళ్లకు, కొత్త అల్లుళ్లకు వాళ్ల వాళ్ల కుటుంబాల్లో జరిగే పండుగలు పబ్బాలు, ఇతర శుభకార్యాలు, పూజలు పునస్కారాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా కొత్త కోడళ్లు, కొత్త అల్లుళ్లు జాతర వచ్చేవరకూ తమ తమ కుటుంబాలతో పూర్తిగా కలిసిపోయే అవకాశం ఉండదు. కచ్చితంగా దానికోసం వాళ్లంతా జాతరకోసం నిరీక్షించాల్సిందే.

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ సమీపంలోని కెస్లాపూర్ గ్రామంలో నాగోబా ఆలయం ఉంది. ఇది ఆదిలాబాద్ కి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కెస్లాపూర్ జనాభా నాలుగైదు వందలవరకూ ఉంటంది. కానీ జాతర జరిగే సమయంలో లక్షలాందిమంది గిరిజనులు చుట్టుపక్కల రాష్ట్రాలనుంచికూడా లక్షలాదిగా ఇక్కడికి తరలివస్తారు.

ఏటా పుష్యమాసంలో నాగోబా జాతర జరుగుతుంది. నాగోబాను పూజిస్తే పంటలు బాగా పండుతాయని, రోగాలు మటుమాయం అవుతాయనీ, తమ కుటుంబాలు సుఖసౌఖ్యాలతో వర్థిల్లుతాయనీ గిరిజనుల విశ్వాసం. నాగోబా తమ పిల్లాపాపల్ని చల్లగా కాపాడతాడని గిరిజనులు బలంగా నమ్ముతారు.

Next Story