ఇలా చేస్తే మాస్కులపై వైరస్ మాయం
By సుభాష్ Published on 3 Aug 2020 7:51 AM ISTప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ముఖానికి మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి ఎంతో అవసరం. కరోనా కట్టడిలో భాగంగా ఎన్-95 మాస్కులను వినియోగిస్తున్నారు. అయితే మాస్కులు ధరించడంలో కూడా ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎన్-95 మాస్కులను వేడి అవిరితో శుభ్రం చేస్తే వైరస్ చనిపోతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అలా శుభ్రం చేసిన తర్వాత మాస్కులను మళ్లీ వాడుకోవచ్చని చెబుతున్నారు. ఎన్-95 మాస్కులను గంటపాటు 70 డిగ్రీల ఆవిరిలో ఉంచడం ద్వారా వైరస్ నశిస్తుందని పేర్కొన్నారు.
ఇలా అవిరి రూపంలో శుభ్రం చేసిన మాస్కులు పాడవకుండా ఉంటుందని తమ పరిశోధనలో తేలినట్లు యూనివర్సిటీ ఆఫ్ టొరంటో శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఒక్కగంట సమయం పాటు అవిరిలో ఉంచడం వల్ల మాస్కులపై ఏ రకమైన వైరస్ ఉన్నట్లుగా ఆనవాళ్లు లభించలేదని శాస్త్రవేత్తలు వివరించారు. దాదాపు పదిసార్లు మాస్కులను అవిరిలో ఈ విధంగా ఉంచవచ్చని అన్నారు.
కాగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి అధికంగా పెరగడంతో వైరస్‌ను కట్టడి చేసేందుకు ఇబ్బందిగా మారింది. ఇప్పటికే ప్రభుత్వాలు కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం ఆగడం లేదు. సామాన్యుల నుంచి ప్రతి ఒక్కరికి ఈ వైరస్ సోకేస్తోంది. ప్రస్తుతం కరోనాకు ఎలాంటి వ్యాక్సిన్ లేని కారణంగా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఎవరికి వారు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం ఇలా.. ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవడం తప్ప ఎలాంటి మార్గం లేదు.