ఫ్రాన్స్‌లో దారుణం.. ఓ మ‌హిళ త‌ల‌న‌రికిన ఉన్మాది

By సుభాష్  Published on  30 Oct 2020 6:15 AM GMT
ఫ్రాన్స్‌లో దారుణం.. ఓ మ‌హిళ త‌ల‌న‌రికిన ఉన్మాది

ఫ్రాన్స్‌లో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియ‌ని ఓ దుండ‌గుడు దారుణంగా ఓ మ‌హిళ త‌ల న‌రికాడు. అంతేకాకుండా మ‌రో ఇద్ద‌రిని హ‌త్య చేశాడు. ఈ ఘ‌ట‌న నైస్ న‌గ‌రంలోని స్థానిక నోట్రే డేమ్ చ‌ర్చి స‌మీపంలో గురువారం ఉద‌యం చోటు చేసుకుంది. ఈ దాడిని అక్క‌డి నగర మేయర్ క్రిస్టియన్ ఎస్ట్రోసి ధృవీక‌రించారు. ఇది ఉగ్రవాద చర్యేనని.. దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. ఈ దారుణ ఘటనలో ముగ్గురు చనిపోగా.. ప‌లువురు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ఇటీవలే ఫ్రాన్స్ లో ఓ ఉపాధ్యాయుడి తలను ఇస్లామిక్ అతివాదులు నరికారు. అక్టోబ‌ర్ మొద‌టి వారంలో పారిస్‌లో శామ్యూల్ పాటీ అనే స్కూల్ టీచ‌ర్‌ను చెచెన్ సంత‌తికి చెందిన ఓ యువ‌కుడు అతి దారుణంగా త‌ల న‌రికి చంపాడు. పాఠం చెబుతున్న‌ప్పుడు మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త కార్టూన్ల‌ను చూపించాడ‌ని, అందుకు ప్ర‌తీకారంగానే టీచ‌ర్‌ను హ‌త్య చేసిన‌ట్లు స‌ద‌రు యువ‌కుడు విచార‌ణ‌లో వెల్ల‌డించాడు. ఈ ఘటన నుంచి అక్కడి ప్రజలు ఇంకా తేరుకోకముందే ఈరోజు మరో ఘటన జరిగింది. దీంతో.. అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

మరోవైపు కార్టూన్లను ప్రదర్శించే హక్కు తమకు ఉందంటూ.. ఈ హత్యను ఖండిస్తూ నిర్వహించిన ర్యాలీల్లో నిరసనకారులు నినదించారు. ఫ్రాన్స్ పై ముస్లిం అతివాదులు కన్నేశారని.. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి కార్టూన్లు వస్తూనే ఉంటాయని ఫ్రాన్స్ అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. ఇది ముస్లిం సమాజంలో మరింత ఆగ్రహానికి కారణమైంది.

Next Story
Share it