ఈ హైవే నుంచి పాఠాలు నేర్చుకుందామా.?
By అంజి Published on 29 Jan 2020 5:09 AM GMTఎక్స్ ప్రెస్ హైవే అంటే క్రమేపీ నరకానికి దగ్గరి దారిగా మారిపోయాయి. రెచ్చగొట్టే రోడ్లు, విచ్చలవిడి డ్రైవర్లు, వీర స్పీడు వాహనాలు కలిసి రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మన ఔటర్ రింగ్ రోడ్లు, ఎక్స్ ప్రెస్ వేలలో జరుగుతున్నది ఇదే. అయితే ఈ దిశగా మన హైవేలు, ఎక్స్ ప్రెస్ వేలు ముంబాయి-పుణే ఎక్స్ ప్రెస్ వే నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది.
ఈ హైవే 2016 లో ప్రారంభం అయింది. అప్పట్నుంచి ఇది ప్రమాదాలకు నెలవుగా మారింది. దీంతో ప్రమాదాలు తగ్గించేందుకు అధికారులు ప్రమాద రహిత కారిడార్ గా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. జీరో ఫాటాలిటీ కారిడార్ (ఒక్క ప్రమాదం కూడా జరగని రహదారి) పథకాన్ని అమలు చేశారు. మహరాష్ట్ర రాష్ట్ర రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్, మహారాష్ట్ర హైవే పోలీసు, మహీంద్ర అండ్ మహీంద్ర సంస్థ, సేవ్ లైఫ్ ఫౌండేషన్ లు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నాయి. వీరి ప్రయత్నాల వల్ల 2016 తో పోలిస్తే ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. 2016 లో ఈ హైవేపై జరిగిన ప్రమాదాల్లో చనిపోయిన వారి సంఖ్య 151. 2019 లో చనిపోయిన వారి సంఖ్య 86.
ప్రమాదాలు ఎక్కువగా రోడ్డు అంచులు సరిగ్గా లేకపోవడం వలన, చెట్లను ఢీకొనడం వల్ల, వాహనాలు హైవే పై నలుపుచేయడం వల్ల, ప్రమాదకరమైన మలుపుల వల్ల, ఇతర వాహనాలను ఢీకొనడం వల్ల, రోడ్లు జారుడుగా ఉండటం, హఠాత్తుగా రోడ్డు డౌన్ అయిపోవడం, ముందున్నది కనిపించడం, రోడ్ డివైడర్ల వల్ల జరుగుతూంటాయి. ప్రమాదాలు కూడా అయిదు కారణాల వల్ల జరుగుతాయి. వెనక నుంచి గుద్దుకోవడం, బండి బోల్తా పడటం, గింగిరాలు కొట్టడం, పాదచారులను ఢీకొనడం, ఇతర కారణాల వల్ల ప్రాణనష్టం జరుగుతోంది.
అతి వేగం వల్ల 43 శాతం ప్రమాదాలు, లేన్లు హఠాత్తుగా మారడం వల్ల 38.4 శాతం, వాహనాలు రోడ్లపై అనధీకృతంగా నిలుపుచేయడం వల్ల 28 శాతం, అలసట, నిద్రల వల్ల 23 శాతం, పాదచారులను ఢీ కొనడం వల్ల 12.8 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో హైవేపై గస్తీని పెంచడం, రోడ్డునియమాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం, రోడ్లపై స్వచ్ఛంద కార్యకర్తల కౌన్సెలింగ్ వంటి చర్యల వల్ల ముంబాయి పుణె ఎక్స్ ప్ర్ఎస్ వే పై ప్రమాదాలు 43 శాతం మేరకు తగ్గాయి. ఒక్క ప్రమాదమూ జరగకుండా చూడటమే తమ లక్ష్యం అంటున్నారు అధికారులు.
మన ఓఆర్ ఆర్, ఎక్స్ ప్రెస్ వేలలోనూ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుందేమో? ప్రాణాలు అర్థాంతరంగా గాల్లో కలిసిపోకుండా ప్రయత్నించగలమేమో?