అర్థరాత్రి ఎమ్మెల్యే హల్‌చల్.. రాత్రంతా రోడ్డుపైనే!

By Newsmeter.Network  Published on  11 March 2020 3:35 AM GMT
అర్థరాత్రి ఎమ్మెల్యే హల్‌చల్.. రాత్రంతా రోడ్డుపైనే!

అర్థరాత్రి టీడీపీ ఎమ్మెల్యే హల్‌ చల్‌ సృష్టించాడు.. స్థానిక మున్సిపల్‌ అధికారుల తీరుకు నిరసనగా రాత్రంతా రోడ్డుపైనే నిద్రించాడు. ఎందుకు.. ఆ ఎమ్మెల్యేకు అంత కష్టమేం వచ్చిందని అనుకుంటున్నారా.. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంగళవారం అర్థరాత్రి సమయంలో అన్న క్యాంటీన్‌ను మున్సిపల్‌ అధికారులు తొలగించే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యేకు సమాచారం ఇవచ్చారు. దీంతో హుటాహుటీన అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అధికారులను నిలదీశారు.

క్యాంటిన్‌ను తీసేయవద్దని, ఎంతో మందిపేదలకు ఈ క్యాంటిన్‌ ద్వారా అన్నదానం చేయటం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. కానీ అధికారులు మాత్రం తమకు షెడ్డును కూల్చేయాలని ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. అధికారులకు తీరుకు నిరసనగా రామానాయుడు నడిరోడ్డుపై పడుకున్నాడు. పోలీసులు వచ్చి ఆయనకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ టీడీపీ ఎమ్మెల్యే వెనక్కు తగ్గలేదు. రాత్రంత్రా రోడ్డుపైనే చలికి లెక్కచేయకుండా పడుకుండిపోయాడు. విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకోవటంతో అధికారులుసైతం షెడ్డును కూల్చేందుకు వెనక్కు తగ్గినట్లు తెలిసింది.

ఇదిలా ఉంటే గత టీడీపీ హయాంలో పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్మోహన్‌ రెడ్డి వాటిని రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కాగా పాలకొల్లులో మాత్రం టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఓ షెడ్‌ ఏర్పాటు చేసి అక్కడ క్యాంటిన్‌ నడిపిస్తున్నారు. రోజూ పేదలకు అన్నదానం చేస్తున్నారు. పుట్టిన రోజు, పెళ్లిరోజు ఇలా ఏ శుభకార్యం ఉన్నా కొందరు అన్నదానం చేసేందుకు ముందుకొస్తున్నారు. దీంతో అక్కడ నిత్యం అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అకస్మాత్తుగా మంగళవారం రాత్రి షెడ్డును కూల్చేందుకు అధికారులు రావటంతో ఎమ్మెల్యే ఆందోళనకు దిగాడు. ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఈ పరిణామం తమకు కలిసొస్తుందని స్థానిక టీడీపీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story