240 ఏళ్ల నాటి చెత్త హిమాలయాల్లో ఉందట..!

By అంజి  Published on  12 Feb 2020 7:45 AM GMT
240 ఏళ్ల నాటి చెత్త హిమాలయాల్లో ఉందట..!

ప్రపంచాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సమస్యల్లో వాతావరణ కాలుష్యం కూడా ఒక్కటి. ఇప్పటికే నీరు, గాలి, భూమి మొత్తం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ఎప్పటి నుండో మానవుడు ఈ భూమిపై చెత్తను వేస్తూనే ఉన్నాడు. అవి ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తరలి వెళుతూనే ఉంటాయి. కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి ఇండస్ట్రియల్ చెత్త ఇప్పటికీ ఈ భూమి మీదనే ఉంది. 240 ఏళ్ల క్రితం యూరప్ లో పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడు ఉపయోగించిన వస్తువులు ఏకంగా హిమాలయాలను చేరాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనిషి ఈ భూ ప్రపంచాన్ని ఎంతలా పాడుచేశాడో ఈ ఉదంతమే ఉదాహరణ అని వారు అంటున్నారు.

అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు 1780లలో యూరప్ లో పారిశ్రామిక విప్లవం వచ్చిన సమయాల్లో వాడిన కాడియం, క్రోమియం, నికెల్, జింక్ వంటి పదార్థాలు అప్పట్లోనే హిమాలయాల్లోకి చేరుకున్నాయని చెబుతున్నారు. భూమి మీద అతి ఎత్తైన ప్రాంతంలో కూడా పారిశ్రామిక వ్యర్థాలు చేరుకున్నాయని వారు చెబుతున్నారు. ఓహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం చేపట్టిన రీసర్చ్ లో 18వ శతాబ్దంలో బొగ్గును విపరీతంగా మండించగా వాటి బైప్రోడక్ట్స్ హిమాలయాల్లోని దసువోవు హిమనీనదంపై చేరాయి. భీకరమైన గాలుల కారణంగానే ఆ చెత్త అంతా హిమాలయాల్లోకి చేరి ఉందని వారు చెబుతున్నారు. అది కూడా దాదాపు 23,600 అడుగుల ఎత్తులో ఈ పదార్థాలు అన్ని పేరుకుపోవడం చూసి శాస్త్రవేత్తలు షాక్ అవుతున్నారు.

Muck in the Himalayas

18, 19 శతాబ్దాలలో వ్యవసాయ భూములను సృష్టించడం కోసం పెద్ద ఎత్తున అడవులను మానవుడు తగులబెట్టాడు.. అలాంటి సమయంలోనే జింక్ లాంటి పదార్థాలు పెద్ద ఎత్తున వెలువడ్డాయి.. అవి కాస్తా హిమాలయాల వరకూ అప్పట్లోనే చేరుకున్నాయి. 'Proceedings of the National Academy of Sciences' అనే స్టడీ పేపర్ లో ఈ విషయాలన్నీ పొందుపరిచారు. ఆ సమయంలో పారిశ్రామిక విప్లవానికి తోడుగా జనాభా కూడా విపరీతంగా పెరిగిపోయిందని.. ప్రజలకు అవరమైన పంటలు పండించడానికి వ్యవసాయ పొలం అవసరమవ్వగా.. పెద్ద ఎత్తున అడవులను తగులబెట్టారని ఓహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన రీసర్చ్ సైంటిస్ట్ పావ్లో గాబ్రియెల్లే తెలిపారు.

గాబ్రియెల్లే తన స్నేహితులతో కలిసి అక్కడి మంచుకు సంబంధించిన శాంపుల్స్ ను పరిశీలించారు. 1499 నుండి 1992 వరకూ వచ్చిన మార్పులను అధ్యయనం చేశారు. 1810 నుండి 1880 మధ్యన విపరీతమైన కాలుష్యం పెరిగి అది హిమాలయాల మంచులో కలిసిపోయిందని వారు చెబుతున్నారు. మంచులో ఆ లోహాల శాతం అధికంగానే ఉందని అవి మరీ విషపూరితమైనవైతే కావని గాబ్రియెల్లే టీమ్ చెబుతోంది. దసువోవు హిమనీనదం శిశపంగ్మా పర్వతం మీద ఉంది. 1964 లో మొదటి సారి మానవుడు ఆ పర్వతాన్ని అధిరోహించినట్లు రికార్డుల్లో ఉంది. కానీ అప్పటికే మానవుడు సృష్టించిన వ్యర్థాలు హిమాలయాల్లోకి చేరుకున్నాయి.

Next Story
Share it