విజ‌య‌సాయిరెడ్డి గుడ్ న్యూస్‌..!

By రాణి  Published on  4 Jan 2020 11:48 AM GMT
విజ‌య‌సాయిరెడ్డి గుడ్ న్యూస్‌..!

వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కృషి ఫ‌లించింది. పాకిస్థాన్ చెర‌లో ఉన్న ఉత్త‌రాంధ్ర జాల‌ర్లు తిరిగి రాబోతున్నారు. జాల‌ర్ల‌ను పాకిస్థాన్ విడుద‌ల చేయ‌బోతుంది. ఈ నెల 6న వాగా స‌రిహ‌ద్దుల వ‌ద్ద ఉత్త‌రాంధ్ర జాల‌ర్ల‌ను భార‌త్ అధికారుల‌కు అప్ప‌గిస్తామ‌ని పాకిస్థాన్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు భార‌త విదేశాంగ శాఖ‌కు పాకిస్థాన్ ప్ర‌భుత్వం స‌మాచారం అందించింది. ఉత్త‌రాంధ్ర‌కు చెందిన 20 మంది మ‌త్స్య‌కారులు పొట్ట‌కూటి కోసం గుజ‌రాత్‌కు వ‌ల‌స వెళ్లారు. గుజ‌రాత్ వ‌ద్ద స‌ముద్రంలో చేప‌ల‌వేట సాగిస్తున్న స‌మ‌యంలో మ‌త్స్యాక‌రులు పొర‌పాటున పాకిస్థాన్ జ‌లాల్లోకి ప్ర‌వేశించారు. దాంతో వారిని పాక్ భ‌ద్ర‌తా బ‌లాలు అరెస్టు చేసి జైలులో ఉంచాయి. వారిని విడిపించేందుకు ఆరేడు నెల‌లుగా వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు.

మ‌త్స్య‌కార కుటుంబ స‌భ్యుల‌ను భారత విదేశాంగ‌శాఖ మంత్రి జ‌య‌శంక‌ర్ వ‌ద్ద‌కు తీసుకెళ్లిన విజ‌య‌సాయిరెడ్డి వారి గోడును వినిపించారు. వైసీపీ ఎంపీల బృందం కూడా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జ‌య‌శంక‌ర్‌ను క‌లిసి ఈ అంశంపై విన‌తిప‌త్రం అంద‌జేసింది. వైసీపీ ఎంపీలు కేంద్ర మంత్రి జ‌య‌శంక‌ర్‌ను క‌ల‌వ‌గా, ఆ రోజున టీడీపీ మీడియా సంస్థ‌లు మాత్రం నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ కోస‌మే వైసీపీ ఎంపీల బృందం జ‌య‌శంక‌ర్‌ను క‌లిసింది అంటూ టీడీపీ మీడియా ప్ర‌చారం చేసింది.

మ‌త్స్య‌కారుల అంశంలో క్ర‌మం త‌ప్ప‌కుండా కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల‌ను క‌లుస్తూ విజ‌య‌సాయిరెడ్డి ఒత్తిడి తెచ్చారు. ఈ నేప‌థ్యంలో ఎట్ట‌కేల‌కు భార‌త ప్ర‌భుత్వ ప్ర‌య‌త్నాల‌కు పాకిస్థాన్ సానుకూలంగా స్పందించింది. మ‌త్స్య‌కారుల‌ను విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. 20 మంది ఉత్త‌రాంధ్ర మ‌త్స్య‌కారుల జాబితాను కూడా పాకిస్థాన్ భార‌త్‌కు పంపించింది. పాకిస్థాన్‌కు ప‌ట్టుబ‌డ్డ మ‌త్స్య‌కారులు విజ‌య‌న‌గ‌రం, శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన వారు. మ‌త్స్య‌కారుల విడుద‌ల‌కు వైసీపీ ఎంపీ విజ‌యసాయిరెడ్డి చేసిన కృషిని పలువురు అభినందిస్తున్నారు.

Next Story