సినిమా షూటింగ్‌లకు కేంద్రం అనుమతి.. మార్గదర్శకాలు విడుదల
By సుభాష్ Published on 23 Aug 2020 6:33 AM GMTఆన్‌లాక్ 3.0లో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మార్గదర్శకాల్లో భాగంగా సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగ్‌లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్‌లు నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేక్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తక్కువ సిబ్బందితో సినిమా, టీవీ షూటింగ్‌లు జరుపుకోవాలని కేంద్రం సూచించింది.
షూటింగ్‌ల దగ్గర ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించడం తప్పని సరి అని, భౌతిక దూరం తప్పనిసరి అని తెలిపింది. అలాగే ఆరోగ్య సేతు యాప్‌ను నటీనటులంతా ఉపయోగించాలని, షూటింగ్‌ల సమయంలో విజిటర్లకు అనుమతి ఇవ్వవద్దని మార్గదర్శకాల్లో తెలిపింది. అంతేకాకుండా మేకప్ సిబ్బంది తప్పనిసరిగ్గా పీపీఈ కిట్లు ధరించాలని తెలిపింది. ఇక సినిమా థియేటర్లపై కూడా పలు సూచనలు చేసింది. థియేటర్లలో భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపడుతూ సీటింగ్ ఏర్పాటు చేయాలని పేర్కొంది. టికెట్లు ఆన్‌లైన్‌లో అమ్మకాలు జరపాలని, థియేటర్లలోకి వెళ్లే మార్గాన్ని థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. థియేటర్లు, పార్కింగ్ ప్రదేశాలలో రద్దీ కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రం తెలిపింది.