బాబోయ్.. అల్లు అరవింద్‌పై సినిమానా?
By సుభాష్ Published on 29 July 2020 9:33 AM ISTరామ్ గోపాల్ వర్మ ఓ ఫిలిం మేకర్‌గా ఎంత కిందికి పడ్డా కూడా అతనంటే ఇండస్ట్రీ జనాలతో పాటు బయటి వాళ్లకు కూడా భయం ఉంది. ఎందుకంటే అతను ఎప్పుడు ఎవరి మీద యా యాంగిల్లో సినిమా తీస్తాడో తెలియదు. మిగతా దర్శకులు ఏదైనా కాంట్రవర్శీ వస్తే ఎలా అని భయపడతారు. కానీ వర్మ మాత్రం కాంట్రవర్శీ అయి పబ్లిసిటీ వస్తే సినిమా సేల్ అయిపోతుందని చూస్తాడు. ఈ విషయంలో వర్మ దాచుకునేదేమీ కూడా లేదు. ఆ విషయాన్ని ఓపెన్‌గా చెప్పేస్తాడు కూడా. గత ఏడాది తెలుగుదేశం పార్టీని, దాని అధినేత నారా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ‘అమ్మ రాజ్యంలో కమ్మ బిడ్డలు’ లాంటి సినిమాలు వదిలాడు వర్మ. వాటితో టీడీపీ వాళ్లు ఎంతగా ఇబ్బంది పడ్డారో తెలిసిందే. తాజాగా పవన్‌ను లక్ష్యంగా చేసుకుని ‘పవర్ స్టార్’ సినిమా తీశాడు. చివర్లో పవన్ వైపు టర్న్ తీసుకున్నప్పటికీ ఇది ఆయనకు ఇబ్బంది కలిగించే సినిమానే.
ఇదిలా ఉంటే.. వర్మ త్వరలోనే బెల్లంకొండ సురేష్ మీద నందమూరి బాలకృష్ణ కాల్పులు జరిపిన ఘటన నేపథ్యంలో సినిమా తీస్తాడని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఇదే నిజమైతే ఓ సంచలనమే అవుతుంది. మరోవైపు ఉదయ్ కిరణ్ మీద సినిమా దిశగానూ వర్మ అడుగులేస్తున్నట్లు చెబుతున్నారు. అది మెగా ఫ్యామిలీకి ఇబ్బంది కలిగించేదే. అంతటితో ఆగకుండా మెగా ఫ్యామిలీకి వెన్నెముకలా ఉంటూ సైలెంటుగా తన పనేదో తాను చేసుకుపోయే అల్లు అరవింద్ మీద వర్మ సినిమా తీయాలని యోచిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తుండటం విశేషం. అరవింద్ విషయంలో మరీ వివాదాలేమీ లేవు కానీ.. ఇండస్ట్రీని గుప్పెట్లో పెట్టుకున్న నలుగురు పెద్దల్లో ఒకడిగా అరవింద్ పేరు వినిపిస్తుంటుంది. అలాగే ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి కొన్ని ఆరోపణలు, నిందలు ఎదుర్కొన్నారాయన. వర్మ సినిమా తీస్తే ఈ అంశాల మీద ఫోకస్ పెడతాడేమో. కానీ మిగతా సినిమాలతో పోలిస్తే వర్మ కోరుకునే వివాదాలు, పబ్లిసిటీ అరవింద్ సినిమా మీద రాకపోవచ్చు. కాబట్టి ఈ ఆలోచన విరమించుకుంటే మంచిదేమో.