నోరు జారిన నరసాపురం ఎంపీ.. సోషల్‌ మీడియాలో రచ్చరచ్చే..

By Newsmeter.Network  Published on  19 March 2020 8:05 AM GMT
నోరు జారిన నరసాపురం ఎంపీ.. సోషల్‌ మీడియాలో రచ్చరచ్చే..

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో రచ్చచేస్తున్నాయి. నరసాపురం పార్లమెంట్‌ స్థానం నుంచి గెలిపొందిన ఆయన.. ఎప్పుడూ యాక్టివ్‌గా కనిపిస్తుంటారు. వైసీపీలో ఎంపీల దారంతా ఒకలా ఉంటే రామకృష్ణం రాజు రూటే సపరేటు. పలుసార్లు సొంత పార్టీ నిర్ణయాలతో విబేధించినట్లు కనిపించే రఘురామకృష్ణంరాజు.. బీజేపీలో చేరుతారని ప్రచారం సాగింది. ఆయన ఇటీవల బీజేపీ చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాజాగా కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ మార్కెట్‌ యార్డ్ చైర్మన్‌ ఎంపిక విషయంలో స్థానికంగా పార్టీ కార్యకర్తల మధ్య విబేధాలు తలెత్తాయి. వైసీపీలోని రెండు వర్గాలు తమ నేతకు చైర్మన్‌ సీటు ఇవ్వాలని కోరడంతో అంతర్గతంగా ముసలం మొదలైంది. దీనిపై ఎంపీ రఘురామ కృష్ణం రాజు వారితో మాట్లాడారు. కార్యకర్తలు ఎవరూ తొందర పడొద్దని, అందరికి న్యాయం జరుగుతుందని అన్నారు. ఆవేశాలకు పోయి ఘర్షణలకు దిగితే మీకే ఇబ్బంది వస్తుందని, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. అంతేకాక అందరం మంత్రి మోపిదేవితో చర్చించి ఏకాభిప్రాయంతో చైర్మన్‌ ఎంపిక ప్రక్రియను పూర్తి చేద్దామని హామీ ఇచ్చారు.

ఇదే సమయంలో అక్కడ గుమ్మికూడిన వైసీపీ కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. జై జగన్‌.. జగన్‌ నాయకత్వం వర్దిల్లాలి, రఘురామ కృష్ణం రాజు నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినాదాలు చేశారు. రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతుండగానే పదేపదే కార్యకర్తలు నినాదాలు చేయడంతో ఆయనకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో అక్కసారిగా కార్యకర్తలపై ఊగిపోయారు.. ఎవడి నాయకత్వం కావాలి, బొచ్చులో నాయకత్వం, నోరు మూసుకు కూర్చోవాలంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story
Share it