మదర్స్ డే స్పెషల్స్.. తల్లి హృదయం ఏమిటో చూపించే బాలీవుడ్ సినిమాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 May 2020 11:52 AM GMT
మదర్స్ డే స్పెషల్స్.. తల్లి హృదయం ఏమిటో చూపించే బాలీవుడ్ సినిమాలు

తల్లిని మించిన గొప్ప వ్యక్తి ఎవరు లేరు ఈ ప్రపంచంలో..! తల్లి గొప్పతనం ఏంటో తెలియజేయడానికి పదాలు సరిపోవు. చాలా భాషల్లో తల్లి గొప్పతనానికి సంబంధించి సినిమాలు కూడా ఎన్నో వచ్చాయి. బాలీవుడ్ లో కూడా అప్పటి నుండి ఇప్పటివరకూ తల్లి గొప్పదనాన్ని చాటుతూ చాలా సినిమాలు వచ్చాయి.

లాక్ డౌన్ కారణంగా చాలా సమయం దొరుకుతోంది కాబట్టి.. తెలుగు సినిమాలు ఎన్నని చూస్తారు చెప్పండి. అప్పుడప్పుడు హిందీ సినిమాలు కూడా చూడండి. మరీ పాత సినిమాలు కాదు కానీ.. కాస్త కొత్తవి కూడా ఏ సబ్ టైటిల్స్ సహాయంతోనే చూసేయండి. మదర్స్ డే రోజున తల్లితో కలిసి కాలక్షేపం చేయండి.

వి ఆర్ ఫ్యామిలీ:

We R Family

2010 లో విడుదలైన ఈ సినిమాలో కాజోల్, అర్జున్ రామ్ పాల్, కరీనా కపూర్ లు లీడ్ రోల్ లో నటించారు. తన ముగ్గురు పిల్లల కోసం ఏదైనా చేసే తల్లి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. చివరికి తన భర్తకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నా కూడా అందుకు ఒప్పుకుంటుంది. కాజోల్ తల్లి క్యారెక్టర్ లో జీవించేసింది. క్యాన్సర్ తో పోరాడుతున్న తల్లి పాత్రలో కాజోల్ నటిస్తూ.. తాను వెళ్ళిపోయాక భర్త.. అతని గర్ల్ ఫ్రెండ్ తన పిల్లల్ని ఎలా చూసుకుంటారు అన్న సందేహాలను కాజోల్ నివృత్తి చేసుకుంటుంది. మంచి ఎమోషన్స్ ఉన్న సినిమా ఇది.

నిల్ బట్టే సన్నాటా..!

1

చాలా మంచి సినిమా.. స్వరా భాస్కర్ ఇండిపెండెంట్ మహిళగా తన ఒక్కగానొక్క కూతురికి చదువు వైపు దృష్టి మళ్లేలా చేయాలని చిన్న పందెం వేసుకుంటుంది. ఆ పందెం ఎంతో ఫన్నీగా ఉండడమే కాకుండా.. కూతురు తల్లి మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత పెంచుతుంది. పని మనిషి కూతురు పని మనిషి గానే బ్రతకకూడదని తెలియజేస్తూ అశ్విని అయ్యర్ తివారీ ఈ సినిమాను రూపొందించింది. ఎంతో మంది సింగిల్ మదర్స్ కు ఈ సినిమా అంకితం.

పా:

Paa2

ఈ సినిమాలో తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. ఇందులో తండ్రి గా అభిషేక్ బచ్చన్ నటించగా.. కొడుకుగా అమితాబ్ నటించాడు.. ఈ సినిమాలో తల్లి పాత్రలో కనిపించింది విద్యా బాలన్. ఎంతో గొప్పగా ఈ పాత్రను తీర్చి దిద్దారు ఆర్. బాల్కి. అరుదైన వ్యాధితో బాధపడుతున్న కుమారుడి కోర్కెలను తీర్చడానికి తల్లి ఎంత కష్టపడుతుందో ఈ సినిమాలో చూపించారు. ఆ పాత్రలో విద్యా బాలన్ ఒదిగిపోయింది.

సీక్రెట్ సూపర్ స్టార్:

22

అద్వైత్ చందన్ తొలిసారి దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి ప్రశంసలను దక్కించుకుంది. ఆమిర్ ఖాన్ లాంటి స్టార్ ఈ సినిమాలో చిన్న పాత్రలో కనిపిస్తారు. ఇంటికే పరిమితమైన తల్లి.. తన కూతురి ట్యాలెంట్ ను గుర్తించి ప్రోత్సహిస్తుంది. భర్త ఎంతగా ఇబ్బంది పెట్టినా.. తన కూతురి కోసం ఆమె పడే కష్టం చాలా రియలిస్టిక్ గా చూపించారు. ఇది చాలా మంది తల్లుల జీవితంలో చోటుచేసుకున్న ఘటనలే..! తన కూతురి రెక్కలు విరిచేయాలని అనుకుంటున్న భర్తతో పోరాడి విజయం సాధిస్తుంది. అమ్మ బిడ్డలను నమ్మితే ఎంతకైనా తెగిస్తుంది అన్నది ఈ సినిమాలో చూపించారు.

ఇంగ్లిష్ వింగ్లిష్:

11

గౌరీ షిండే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీదేవి ముఖ్య పాత్ర పోషించింది. పలు భాషల్లో ఈ సినిమా విడుదలైంది. ఆల్ట్రా మోడరన్ భర్త, టీనేజ్ లో ఉన్న కూతుళ్లు.. తన ఇంగ్లీష్ ను వెటకారం చేస్తుంటే ఇంగ్లీష్ భాషను ఎలాగైనా నేర్చుకోవాలని అనుకుంటూ.. ఆమె పడే పాట్లు నవ్వు తెప్పించినా.. మరో వైపు ఆమెలోని పట్టుదల, తెగింపు అన్నీ ఆలోచింపజేస్తాయి. ఎంతో మంది తల్లులకు ఈ సినిమా ఒక ఇన్స్పిరేషన్ లాంటిది.

మామ్:

Sri

శ్రీదేవి ఫుల్ లెన్త్ రోల్ లో నటించిన ఆఖరి సినిమా 'మామ్'. ఇందులో ఆమె అద్భుతమైన ప్రదర్శన చేసింది. సవతి తల్లి అయినప్పటికీ తన కుమార్తె కోసం ఏదైనా చేసే పాత్రలో శ్రీదేవి కనిపిస్తుంది. తన కుమార్తెకు జరిగిన అన్యాయానికి ఆమె ప్రతీకారం తీర్చుకుంటుంది. థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఇప్పటి సమస్యలను చూపించడమే కాకుండా.. తల్లి ప్రేమ ఎంతదాకానైనా తీసుకుని వెళుతుందని తెలియజేస్తుంది.

ఈ సినిమాలన్నీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో దొరుకుతాయి.. లేదంటే టీవీ ఛానల్స్ లో వేసే అవకాశం కూడా ఉంది. కొన్ని తెలుగు డబ్బింగ్ లో కూడా దొరకవచ్చు.. తల్లితో కలిసి ఈ మదర్స్ డేను ఇంట్లో ఈ సినిమాలు చూసుకుంటూ గడిపేయండి.

Next Story