టవల్‌ను మింగిన కొండచిలువ

By అంజి  Published on  1 March 2020 4:30 AM GMT
టవల్‌ను మింగిన కొండచిలువ

పాములు మనల్ని ఎంతగానో భయపెట్డతాయి. అలా అని అన్నీ కాటేస్తాయని కాదు. పోనీ కాటేసేవన్నీ విషపూరితాలూ కాదు. ఇక వాటిలో కొండచిలువ రూటే సెపరేటు. ఇది కాటేయడం కాదు చక్కగా చాపలాగా చుట్టేసి మింగేయడమే. అయితే ఆకలేసి ఓ కొండచిలువ ఏకంగా టర్కీ టవల్ ను మింగేసి తరువాత అవస్థలు పడ్డ సంఘటన ఆస్ట్రేలియా లోని సిడ్నీ లో జరిగింది.

అసలు విషయం ఏంటంటే.. ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి మోంటీ అనే కొండ చిలువను పెంచుకుంటున్నారు. ఒకరోజు ఆ యజమాని తన మోంటీని తీసుకొని బీచ్‌కు వెళ్లాడు. కొండచిలువకు ఆకలేస్తే ఎదురుగా ఏది ఉంటే దాన్ని గుటుక్కున మింగేసే అలవాటుకదా.. అలాగే అక్కడ ఉన్న ఓ బీచ్ టవల్‌ను మింగేసింది. అయితే స్నాక్స్‌ తినే సమయంలో మౌంటి అవస్థలు పడుతుండటాన్ని గమనించిన యజమాని దాన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళగా పరీక్షలు చేసిన వైద్యులు దాని కడుపులో జీర్ణం కాని ఒక భారీ పదార్థం ఉందని గుర్తించారు.

చిన్న అల్యూమినియం రాడ్‌ను దాని కడుపులోకి జొప్పించారు. దాని అంచున అమర్చిన తేలికపాటి కటింగ్ ప్లయర్ వంటి సాధనంతో ఓ బీచ్ టవల్‌ను వెలికి తీశారు. కొండచిలువ ఆరడుగుల పొడవు ఉంటే.. అది మింగిన టవల్ నాలుగడుగుల పొడవుంది. మొత్తానికి నానా అవస్థలు పడి పాము నోటి ద్వారా విజయవంతంగా బీచ్‌ టవల్‌ను బయటికిలాగారు.

ఇప్పుడు మోంటీ సురక్షితంగా ఉండటంతో పాటు బీచ్‌ టవల్‌ కూడా భద్రంగా ఉందంటూ మౌంటి యజమాని ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. పాము ఆరోగ్యంగా ఉందని, అదే రోజున ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశామని వైద్యులు తెలిపారు. కాగా.. ఈ మొత్తం ఎపిసోడ్‌కు ‘మోంటీ పైథాన్‌ అండ్‌ మిస్సింగ్‌ బీచ్‌ టవల్‌’ అని ఆసుపత్రి వర్గాలు నామకరణం చేశాయి. ఈ వీడియోను ప్రవీణ్‌ కాస్వాన్‌ అనే అటవీశాఖ అధికారి ట్విటర్‌లో పోస్టు చేశారు. మూగజీవాల కడుపుల్లో మినీ కొండల్లా పేరుకుపోయిన ప్లాస్టిక్ కవర్లు, ఇతర ప్రాణాంతక వస్తువులను వెలికి తీసిన సంఘటనలను చాలానే చూసి ఉంటాం. ప్లాస్టిక్ కవర్లు జీర్ణాశయంలోకి వెళ్లి..వాటిని హరాయించుకోలేక ప్రాణాలను పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదీ అలాంటిదే అంటున్నారు నెటిజన్లు.



Next Story