ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ దాడి కేసు నిందితుడు మృతి

By Newsmeter.Network  Published on  11 Feb 2020 11:56 AM GMT
ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ దాడి కేసు నిందితుడు మృతి

చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే, ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ పై దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న మహ్మద్ పహిల్వాన్‌ మృతి చెందాడు. గుండెపోటుతో యశోద ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు.

2011 ఏప్రిల్‌లో పాతబస్తీలోని బార్కస్‌లో ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో అక్బర్ శరీరలోకి 2 బుల్లెట్లు, 17 కత్తి పోట్లు దిగాయి. పాత కక్షల నేపథ్యంలో మహ్మద్ పహిల్వాన్‌ ఈదాడికి పాల్పడినట్లు అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టు అయిన మహ్మద్‌ పహిల్వాన్ చాలా కాలం పాటు జైల్లో ఉన్నాడు. సుప్రీంకోర్టు చివరకు బెయిల్ ఇవ్వడంతో మహమ్మద్ పహిల్వాన్ రిలీజ్ అయ్యాడు. ఈ కేసులో నలుగురిని దోషులుగా తేల్చిన కోర్టు మహ్మద్ పైల్వాన్ ను నిర్దోషిగా పేర్కొంటూ గత సంవత్సరం ఈ కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో జీవితం గడుపుతున్నాడు. కాగా.. తెల్లవారుజామున తీవ్రమైన గుండె నొప్పి రావడంతో ఆయన్ను యశోద హాస్పిటల్ కి తీసుకువచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

అప్పటి దాడిలో అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్రంగా గాయపడ్డారు. మూడేళ్ల చికిత్స అనంతరం కోలుకున్నారు. అక్బరుద్దీన్ శరీరంలో ఓ బుల్లెట్‌ను వైద్యులు తీయలేకపోయారు. దాడి తర్వాత ఆయన కోలుకున్నప్పటికీ.. తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. ఆయన చికిత్స నిమిత్తం అప్పుడప్పుడు లండన్‌ కూడా వెళ్తుంటారు.

Next Story