అజహరుద్దీన్‌కు బాకీ చెల్లిస్తున్న బీసీసీఐ.. ఎంతో తెలుసా..?
By న్యూస్‌మీటర్ తెలుగు
టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్‌కు బీసీసీఐ బాకీ పడింది. అదేంటీ బీసీసీఐ బాకీ పడడటమేంటని అనుకుంటున్నారా..? అవును.. అజహరుద్దీన్‌కు బీసీసీఐ బకాయి పడ్డ రూ. కోటీ 50 లక్షలను చెల్లించేందుకు సిద్ధమైంది. వివరాళ్లోకెళితే.. బీసీసీఐ నిబంధనల ప్రకారం మాజీ ఆటగాళ్లకు రావాల్సిన పెన్షన్, ఇతర సౌకర్యాలతో కలిపి అజహరుద్దీన్‌కు రూ. కోటిన్నర రావాల్సి ఉంది. ఈ డబ్బును అజహర్‌కు ఇవ్వాలని బోర్డు ఏజీఎంలో నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించాడు.
అయితే... గతంలో అజహరుద్దీన్‌పై మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించిన నిషేధం ఉండటంతో బీసీసీఐ ఆ మొత్తాన్ని నిలిపివేసింది. అజహరుద్దీన్.. 2012లో ఏపీ హైకోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, తన బాకీలు చెల్లించాలంటూ రెండేళ్ల క్రితం బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. అయితే అప్పుడు బోర్డు స్పందించలేదు.
ఇప్పుడు బోర్డు అధ్యక్షుడి హోదాలో ఉన్న సౌరవ్ గంగూలీ తన కెరీర్ తొలి కెప్టెన్‌కు మేలు చేకూర్చేలా ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇదిలావుంటే.. ప్రస్తుతం అజహరుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ కు అధ్యక్షుడు. భారత్ తరఫున 99 టెస్టులు ఆడిన అజర్.. 6215 పరుగులు చేశాడు. 334 వన్డేలు ఆడి 9378 పరుగులు చేశాడు.