మోదీ.. మెర్కెల్... ఓ రాజమహేంద్రి 'రత్నం'..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Nov 2019 5:50 AM GMT
మోదీ.. మెర్కెల్... ఓ రాజమహేంద్రి రత్నం..!

ప్రస్తుతం మన దేశంలో పర్యటిస్తున్న జర్మన్ చాన్సెలర్ ఏంజిలా మెర్కెల్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు అద్భుతమైన బహుమతులనిచ్చారు. ఒకటి ఉత్తరం. రెండోది దక్షిణం. ఉత్తర భారతదేశంలో కొత్తగా ఏర్పడ్డ లడాఖ్ తో తయారయ్యే అద్భుతమైన పశ్మీనా శాలువను ప్రధాని బహూకరించారు. రెండో గిఫ్ట్ అచ్చంగా మన తెలుగు గిఫ్ట్. అందునా మన గోదారి ఒడ్డు రాజమహేంద్రి గిఫ్ట్. అదే మన రత్నం పెన్ను.

రత్నం పెన్నులు రాజమహేంద్రి మెయిన్ రోడ్డులో కోటగుమ్మానికి దగ్గరల్లోని అనేకానేక సందుగొందుల్లో ఒక సందులో దొరుకుతాయి. దుకాణం చిన్నదే కానీ దానికి ఘనచరిత్ర. ఈ రోజంటే చాలా మందికి రత్నం పెన్నులంటే తెలియదు కానీ, ఒకప్పుడు రత్నం పెన్ను చొక్కా జేబులో ఉండటం పెద్ద స్టయిల్ స్టేట్ మెంట్! ఎందుకంటే గాంధీ గారు ఏరికోరి రత్నం పెన్నులను తెచ్చుకునేవారు. రత్నం వారు ఆయనకు పెన్నులు బహూకరించేవారు. వాటిని వాడిన గాంధీ గారు చేతితో తయారు చేసిన కాగితంపై రత్నం కంపెనీని అభినందిస్తూ లేఖ వ్రాశారు. 1937 లో నెహ్రూ గారు కూడా రాజమహేంద్రికి వచ్చినప్పుడు రత్నం పెన్నులను ఏరి కోరి కొనుక్కుని వెళ్లారు.

ఇందిరా గాంధీ, ఇండియన్ ఎక్స్ ప్రెస్ అధినేత రామనాథ్ గోయెంకాలు ఆగర్భ శత్రువులు. కానీ ఇద్దరూ ఒకే విషయంలో ఏకాభిప్రాయంతో ఉండేవారు. అదే రత్నం పెన్ను. ఇద్దరూ రత్నం పెన్ను కి పరమ ఫ్యాన్స్. స్వదేశీ పరిశ్రమలు పెరగాలన్న రోజుల్లో ప్రజాకాంక్షలకు ప్రతీకగా రత్నం పెన్ను పుట్టుకొచ్చింది. చెక్క తో చేసిన పెన్ను, కంచుతో చేసిన పాళీ కలగలిసి తయారయ్యే రత్నం పెన్ను నిజంగా మన రాజమహేంద్రి రత్నమే!! రత్నం పెన్నులు మన స్వదేశీ స్ఫూర్తికి, మన సముద్యమ కీర్తికి ప్రతీకలు. అక్కడెక్కడో ఆంగ్లేయులు అమ్మే పెన్ను కన్నా మన సొంత తెలివితేటలతో తయారైన పెన్నులే మిన్న అనుకుని, ఆ పెన్నును వాడటమే స్వాతంత్ర్యోద్యమం అనుకునేవారు. అప్పట్లో అందరి జేబుల్లోనూ అవే పెన్నులు. ఇప్పుటంటే వాటి కీర్తి మసకబారి, మన జ్ఞాపకాలు పొగచూరి ఉండవచ్చు గాక. కానీ ఒకప్పుడు అవి తిరుగుబాటు గన్నులు.

ఇంకు పెన్నుల భవిష్యత్తు బాల్ పాయింట్ పెన్నుల ఎడారిలో ఇంకిపోయిన తరువాత ఈ పెన్నులను వాడేవారే కరువయ్యారు. రత్నం రంగు పాలిపోయింది. పైగా తయారీదారుల్లో వివాదాలు పెరిగిపోయాయి. ఒక వర్గం రత్నం కంపెనీ పేరుతో, ఇంకొకటి రత్నం సన్స్ పేరిట, ఒక అల్లుడుగారు విజయవాడకు తరలి బ్రహ్మం పెన్నుల పేరిట మూడు ముక్కలైపోయారు. కానీ మోదీ గారు ఎక్కడినుంచో తవ్వి తోడి ఈ రత్నం పెన్నును బయటకి తీశారు. గాంధీ గారు రత్నం కంపెనీకి వ్రాసిన లేఖతో పాటు, గాంధీగారు వాడిన రత్నం పెన్నును ఏంజిలా మెర్కెల్ కు బహుమతిగా ఇచ్చారు.

విదేశీ ప్రముఖులకు భారతీయ చరిత్ర, సంస్కృతులతో ముడిపడ్డ వస్తువులను గిఫ్టులుగా ఇవ్వడం మోదీ ప్రత్యేకత. భగవద్గీత ప్రతులను, పురాణ గాధలను, మరుగున పడిపోయిన కళాకృతులను విదేశీ వీవీఐపీలకు ఇవ్వడాన్ని మోదీ గారు ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఆ క్రమంలోనే నేటి తరానికి తెలియని రత్నం పెన్నులను మోదీ మెర్కెల్ కు బహూకరించారు.

కానీ ఇప్పుడు మెర్కెల్ బహుమతుల గదిలో మన రాజమండ్రి రత్నం కాంతులీనుతూ ఉంటుంది. అందునా అది మామూలు పెన్ను కాదు. గాంధీ చేతిని తాకిన మన “రత్నం”!!.

  • రాకా సుధాకర్, సీనియర్ జర్నలిస్ట్

Next Story