చైనాలో భారతీయ విద్యార్థులను తరలించనున్న మోదీ ప్రభుత్వం

By రాణి  Published on  29 Jan 2020 5:58 AM GMT
చైనాలో భారతీయ విద్యార్థులను తరలించనున్న మోదీ ప్రభుత్వం

మరో సారి భారత ప్రభుత్వం విదేశాల్లో ఉన్న భారతీయులు కష్టాల్లో ఉంటే తక్షణం స్పందించింది. గతంలో లిబియాలో చిక్కుకుపోయిన భారతీయ నర్సులను, గల్ఫ్ యుద్ధ సమయంలో కువైట్ నుంచి కార్మికులను తెచ్చినట్టుగానే ఇప్పుడు కరోనా వైరస్ బారిన పడ్డ చైనా దేశంలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులను, ఇతరులను తీసుకు వచ్చే బాధ్యతను భారత ప్రభుత్వం తన భుజానికెత్తుకుంది. ఇప్పటికే భారత ప్రభుత్వం భారతీయ మూలానికి చెందిన విద్యార్థులు, కార్మికులు, ఇతరులను తరలించే విషయంలో సహకరించాల్సిందిగా చైనా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. విదేశ వ్యవహారాల మంత్రి జయశంకర్ కథనం ప్రకారం మరో వారం రోజుల్లో భారతీయులను తీసుకురావడం జరుగుతుంది.

ముఖ్యంగా కరోనా వ్యాధి వ్యాప్తికి కేంద్ర బిందువుగా ఉన్న వుహాన్ నగరం పూర్తి దిగ్బంధనంలో ఉంది. ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం చెప్పింది. ఇక్కడ చిక్కుబడిపోయిన భారతీయులను తరలించే ఏర్పాట్లు మొదలయ్యాయి. భారత ప్రభుత్వం ఒక విమానాన్ని పంపి, భారతీయ విద్యార్తులను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటి వరకు భారతీయ మూలానికి చెందిన వారెవరూ వైరస్ బారిన పడలేదని, కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశానికి వచ్చిన తరువాత వారిని పధ్నాలుగు రోజుల పాటు వేరుగా ఉంచి, అన్ని పరీక్షలు చేసి, వైరస్ లేదని రూఢి చేసుకున్న తరువాత కుటుంబాల వద్దకు పంపించడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే భారతీయ మూలానికి చెందిన విద్యార్థులు చైనాలో కరోనా వైరస్ దాడి వల్ల పలు ఇబ్బందులు పడుతున్నారు. గదులకే పరిమితమై ఉండాల్సి వస్తోంది. కొన్నిచోట్ల తాగునీరు దొరకక వాష్ రూమ్ లలోని నీటిని తాగాల్సి వస్తోంది. చైనాలో దాదాపు 750 మంది భారతీయ విద్యార్థులు మెడిసిన్ చదువుతున్నారు. షాంఘై వంటి నగరాల్లో భారతీయులు పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. వ్యాపారాలు చేస్తున్నారు. వీరి గురించి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే చైనాలో దాదాపు 4500 మంది కరోనా వైరస్ బారిన పడ్డట్టు చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకూ 24 మంది వైరస్ బారిన పడి చనిపోయినట్టు చైనా ధ్రువీకరించింది.

Next Story