ఎమ్మెల్సీ అయితేనేం..“టోల్” తీయాల్సిందే..!!

By రాణి  Published on  25 Feb 2020 7:42 AM GMT
ఎమ్మెల్సీ అయితేనేం..“టోల్” తీయాల్సిందే..!!

ఉపాధ్యాయుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అలుగుబిల్లి నర్సిరెడ్డికి ఓ వింత సమస్య ఎదురైంది. ఆయన గన్ మెన్ ను ఉంచుకోరు. తనకు గన్ మెన్ అవసరం లేదని ఆయన వారందరినీ ప్రభుత్వానికి సరండర్ చేశారు. దాంతో ఆయన కార్లో ఆయన, ఆయన డ్రైవర్ తప్ప మరొకరు ఉండరు. దీంతో సోమవారం ఆయన నార్కట్ పల్లి సమీపంలోని పంతంగి టోల్ ప్లాజా నుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తే సిబ్బంది ఆపి టోల్ ఫీ కట్టమని డిమాండ్ చేశారు. నేను ఎమ్మెల్సీనయ్యా అని ఆయన ఎంత చెప్పినా టోల్ ప్లాజా సిబ్బంది అంగీకరించలేదు. చివరికి ఆయన తన ఐడీ కార్డును కూడా చూపించాడు. దాన్ని చూసి టోల్ సిబ్బంది తమ డేటాబేస్ లో చెక్ చేశారు. అందులో నర్సిరెడ్డి పేరు కనిపించలేదు. దాంతో ఆయన టోల్ కట్టాల్సిందేనని వారు పట్టుబట్టారు.

తాను ఎమ్మెల్సీలకు ఉండే ఫ్రీ టాగ్ సదుపాయాన్ని ఉపయోగించేందుకు ఆన్ లైన్ లో పలు సార్లు ప్రయత్నించానని, అయినప్పటికీ అది నమోదు చేయలేదని ఎమ్మెల్సీ ఆక్షేపించారు. అయినప్పటికీ టోల్ సిబ్బంది మాట వినలేదు. దీంతో ఆయనకు కోపం వచ్చింది. టోల్ బూత్ దగ్గరే ఆయన కూర్చుండిపోయి, ధర్నా ప్రారంభించారు.

ఇంతలో విషయం తెలిసిన జీ ఎం ఆర్ అధికారులు హుటాహుటిన అక్కడికి వచ్చారు. వారు ఎమ్మెల్సీని గుర్తు పట్టారు. ఆయనకు క్షమాపణలు చెప్పి, ఆయన వాహనాన్ని వెళ్లనిచ్చారు. టోల్ ఫీ చెల్లించాల్సిన అవసరం ఆయనకు లేదని, అయితే ఆయన ఫ్రీ ట్యాగ్ లో తన పేరును నమోదు చేసుకుంటే ఈ సమస్య ఎదురయ్యేది కాదని సిబ్బంది ఆయనకు నచ్చచెప్పారు. చివరికి ఎలాగోలా ఎమ్మెల్సీ తన గమ్యానికి చేరుకున్నారు.

Next Story