ఇది దద్దమ్మల సభ : ఎమ్మెల్యే రోజా

By రాణి  Published on  27 Jan 2020 4:54 AM GMT
ఇది దద్దమ్మల సభ : ఎమ్మెల్యే రోజా

పెద్దల సభ సలహాలిచ్చేలా ఉండాలి గానీ..సలహాలు తీసుకునేలా ఉండకూడదన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. ప్రజల తీర్పును పెద్దల సభ గౌరవించాలి కానీ..ఇక్కడ మాత్రం మండలి అందుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తోందని విమర్శించారు. నేడు ఏపీ కేబినెట్ లో శాసనమండలి రద్దు తీర్మానంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్నారు. మండలిని రద్దు చేయాలని ప్రజలంతా కోరుకుంటున్నారని, ప్రజాతీర్పును టీడీపీ అపహాస్యం చేస్తోందని ఆమె మండిపడ్డారు. వికేంద్రీకరణ బిల్లును పెద్దల సభలో ఆమోదించేందుకు తాము టీడీపీ వాళ్లతో బేరసారాలు చేస్తున్నట్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, తమకు అలాంటి అవసరం లేదన్నారు. వైసీపీ ఎవరినీ ప్రలోభపెట్టడం లేదన్నారు. పెద్దల సభకు పెద్దల్ని పంపించాలి గానీ..దద్దమ్మల్ని కాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినా చంద్రబాబుకు అహంకారం తగ్గలేదని రోజా దుయ్యబట్టారు.

రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను మండలి వ్యతిరేకించి...వాటిని సెలెక్ట్ కమిటీకి పంపింది. దీంతో రాజధాని తరలింపు ప్రక్రియ ఆగిపోయింది. మరోవైపు హైకోర్టు కూడా రాజధాని నుంచి ప్రభుత్వ కార్యాలయాలేవీ ఇప్పుడే తరలించడానికి వీల్లేదని పేర్కొంటూ...తదుపరి విచారణను ఫిబ్రవరి 26కు వాయిదా వేసింది. దీంతో వికేంద్రీకరణ ప్రక్రియ ఆగిపోయింది. సెలెక్ట్ కమిటీ నివేదిక వచ్చాకే దీనిపై ఒక స్పష్టత రానుంది. అందుకు ౩ నెలల సమయం పడుతుంది. ఈ విషయాన్ని గ్రహించిన ప్రభుత్వం మండలిని రద్దు చేయాలని తీర్మానించింది. ఈ మేరకు సోమవారం కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో మంత్రులంతా మండలి రద్దు తీర్మానాన్ని ఆమోదించారు. అనంతరం ఆ తీర్మానాన్ని అసెంబ్లీ సమావేశంలో ప్రవేశ పెట్టి..అక్కడ కూడా సభ్యులందరిచే ఆమోదిస్తారు. ఆ తర్వాత తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది. కేంద్రం కూడా ఈ తీర్మానాన్ని ఆమోదిస్తే..మండలి రద్దవుతుంది. కానీ...మండలి రద్దు అంత సులువు కాదంటూ ప్రతిపక్షాల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Next Story