సింగర్‌పై అత్యాచారం.. ఎమ్మెల్యేపై కేసు నమోదు

By సుభాష్  Published on  19 Oct 2020 5:11 AM GMT
సింగర్‌పై అత్యాచారం.. ఎమ్మెల్యేపై కేసు నమోదు

ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఓ సింగర్‌ పై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు ఓ ఎమ్మెల్యే. గాయని ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేతో సహా మరో ఇద్దరు మీద పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. నిషద్‌ పార్టీ (నిర్బల్ ఇండియన్ షోషిత్ హమారా ఆమ్ దళ్) ఎమ్మెల్యే విజయ్‌ మిశ్రా 2014లో తన ఇంట్లో ఓ కార్యక్రమం ఉందంటూ బాధిత సింగర్‌ను తన ఇంటికి పిలిపించాడు. ఆమెపై తండ్రి కొడుకులిద్దరూ అత్యాచారం చేశారు. విషయం ఎవరికైనా చెబితే.. చంపేస్తామని బెదిరించారు. అక్కడితో వారి దాష్టికాలు ఆగలేదు. 2015లోనూ విజయ్‌మిశ్రా మరోసారి ఆమెపై అత్యాచారం చేశారు.

ఆ తర్వాత ఆమెను ఇంటిదగ్గర విడిచిపెట్టి రమ్మని కొడుకు విష్ణుమిశ్రా, మేనల్లుడు వికాస్‌ మిశ్రాలకు విజయ్‌మిశ్రా చెప్పారు. అయితే వారిద్దరూ కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు పేర్కొంది. తాజాగా భూ కబ్జా కేసులో ఎమ్మెల్యే మిశ్రా అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం ఆగ్రా జైలులో ఉన్నాడు. సదరు ఎమ్మెల్యే దగ్గర తన వీడియో క్లిప్ కూడా ఉండడం, భయంతో ఇంతకాలం ఫిర్యాదు చేయలేకపోయానని.. ప్రస్తుతం అతను అరెస్టై.. జైలులో ఉండడంతో ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నట్టు బాధితురాలు తెలిపింది. కాగా, బీజేపీ మిత్రపక్షమైన నిర్బల్ ఇండియన్ షోషిత్ హమారా ఆమ్ దళ్ పార్టీకి చెందిన మిశ్రాపై పలు కేసులున్నాయి. భూ కబ్జాలు, బెదిరింపులు, తదితర కేసులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.

Next Story