తప్పటడుగులు వేస్తున్న రేపటి యువతరం
By Newsmeter.Network Published on 31 Dec 2019 6:36 PM ISTఏమీ తెలియని అమాయక పిల్లలుగా మనం భావిస్తుంటే వారేమో సోషల్ మీడియా పుణ్యమా అని అన్నీ తెలిసిన పెద్దల వలే ప్రవర్తిస్తుంటారు. 14 ఏళ్లు కూడా లేని బాల బాలికలు సోషల్ మీడియాలో నగ్న ఫొటోలను పోస్ట్ చేయడం లైంగిక పరమైన కామెంట్లు చేయడం చేస్తున్నారు. రెండేళ్లుగా ఇంగ్లండ్, వేల్స్‌లో ప్రేమ పురాణం సాగిస్తున్న 6000 మందికి పైగా పిల్లలను 27 పోలీసు బృందాలు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి వారి జాడను కనిపెట్టాయి.
ఇంగ్లండ్, వేల్స్ దేశాల్లో 14 ఏళ్లలోపు బాల బాలికలు ఈ విధంగా వ్యవహరించడం చట్టరీత్యా నేరం. ఒకరికొకరు నగ్న ఫొటోలను పంపించుకోవడంతోపాటు తమ ఫాలోవర్లయిన ఇతరులకు అలాంటి ఫొటోలను పంపించిన 6,499 మంది బాల బాలికలను గుర్తించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. వారిలో ఆరేళ్ల వయస్సు గల పిల్లలు 17 మంది ఉండడం మరింత ఆశ్చర్యం కలిగించినట్లు వారు చెప్పారు. వారిలో ఒక్కొక్కరు నెలకు 183 నుంచి 241 అసభ్య ఫొటోలను పంపించారని వారు తెలిపారు.
పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని 30 మంది పిల్లలపైనే చార్జిషీటు దాఖలు చేసి మిగతా వారిని హెచ్చరికలతో వదిలేశామని పోలీసు తెలిపారు. చార్జిషీటు దాఖలయిన పిల్లలను కూడా కోర్టు హెచ్చరికల ద్వారాగానీ, కౌన్సిలింగ్ ద్వారాగానీ విడుదల చేసే అవకాశం ఉందని చెప్పారు. నగ్న చిత్రాలు పరస్పర ఆమోదంతో షేర్ చేసుకున్నట్లయితే తాము జోక్యం చేసుకోవడానికి కుదరదని అన్నారు. ఈ పిల్లల విషయంలో చర్యలు తీసుకోవాల్సిందిగా ఎవరి దగ్గరి నుండి తమకు ఒత్తిడి లేదని నార్‌ఫోక్ కానిస్టేబుల్ చీఫ్ సైమన్ బైలే పేర్కొన్నారు.