అక్కడ రాని ధర.. ఇక్కడెలా వస్తుంది..? : మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

By Newsmeter.Network  Published on  5 Feb 2020 2:56 PM GMT
అక్కడ రాని ధర.. ఇక్కడెలా వస్తుంది..? : మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

నిజామాబాద్ : స్పైస్ బోర్డు ఆఫీస్‌తో పసుపు రైతులకు ఒరిగేది ఏమిలేదన్నారు రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి. స్పైస్ బోర్డు ఆఫీస్ ఉన్న కేరళలో పసుపు రైతుకు దక్కని మద్దతు ధర.. నిజామాబాద్‌లో స్పైస్ బోర్డు ఆఫీస్ పెట్టినంత మాత్రన ఇక్కడి పసుపు రైతులకు ఎలా వస్తుందని ప్రశ్నించారు. బుధవారం ఆయన భీమ్‌గల్‌లో మీడియాతో మాట్లాడారు. దేశంలో పదహారు చోట్ల స్పైస్ బోర్డు ఆఫీస్‌లు ఉన్నాయని, ఈ ఆఫీసులు ఉన్న చోట్ల మద్దతు ధర రావడం లేదని గుర్తు చేశారు.

ఇరవై సంవత్సరాలుగా వరంగల్‌, ముప్పై సంవత్సరాలు సికింద్రాబాద్‌లో స్పైస్ బోర్డు ఆఫీసులున్నా.. మద్దతు ధర రూ.15వేలు రైతులకు ఎందుకు దక్కడం లేదని ప్రశ్నించారు. పసుపునకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు కానంత వరకు రైతుకు మేలు జరగదని.. రైతుల డిమాండ్‌ మేరకు కేంద్రం పసుపుబోర్డు ఏర్పాటు చేసి.. దాని ద్వారా మద్దతు ధర 15వేలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్రమే పసుపును కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారని, ఈ డిమాండ్లకు స్పందించి ఎన్నికల్లో అర్వింద్ ఐదు రోజుల్లో పసుపుబోర్డు తెస్తానని బాండ్‌పేపర్ రాసిచ్చారని గుర్తు చేశారు. చివరకు ఏడాది కావస్తుండగా ఎంపీ అర్వింద్ తెచ్చింది స్పైస్ బోర్డు ఆఫీసు మాత్రమేనని ఎద్దేవా చేశారు.

స్పైస్ బోర్డు ఆఫీసులతో పసుపు రైతుకు మద్దతు ధర రాదని, ఏ ప్రయోజనాలు ఒనగురవన్నారు. పసుపుబోర్డు తెస్తానని హామీలిచ్చి ఓట్లు వేయించుని.. ఇప్పుడు స్పైస్ బోర్డు ఆఫీసు పేరిట ఆడుతున్న నాటకం ఇదేనన్నారు. రాష్ట్ర మంత్రిగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా.. టీఆర్‌ఎస్ పార్టీ తరపున కేంద్రం పసుపుబోర్డు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.

సీఎం కేసీఆర్‌ రైతులకు 24 కరెంట్‌ అందించడంతో పాటు రైతుబంధు, రైతు భీమా అందిస్తున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి తెలంగాణ భూములకు సాగునీటిని అందిస్తున్నారన్నారు. ఇక రైతులకు కావాల్సింది పసుపు బోర్డు మాత్రమేనని, పసుపు బోర్డును ఏర్పాటు చేయాల్సింది కేంద్రమే కాబట్టి.. అధికారంలో ఉన్న బీజేపీ వెంటనే పసుపు బోర్డును ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పసుపు ధరకు మద్దతు ధర ఇవ్వాలని లేఖ ఇవ్వలేదని అవగాహాన లేకుండా మాట్టాడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని పంటలకు వాణిజ్య పంటలతో సహా మద్దతు ధర ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించామని గుర్తు చేశారు. కేంద్రం మద్దతు ధర ఇవ్వలేక కుంటిసాకులు చెబుతుందన్నారు.

Next Story