బ్రేకింగ్: మాజీ మంత్రి మాణిక్యాలరావు కన్నుమూత
By సుభాష్ Published on 1 Aug 2020 10:32 AM GMTకరోనాకు ఓ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు (60) కన్ను మూశారు. విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. నెల రోజులుగా కరోనాతో బాధపడుతున్న మాణిక్యాలరావు తుదిశ్వాస విడిచారు. 1961లో తాడేపల్లి గూడెంలో జన్మించిన ఆయన.. ఏపీ దేవాదాయ శాఖ మంత్రిగా పని చేశారు. 2014 ఎన్నికల్లో తాడేపల్లి గూడెం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అసెంబ్లీకి ఎన్నికైన మాణిక్యాలరావు.. తొలి ప్రయత్నంలోనే చంద్రబాబు హయాంలో 2018వరకు మంత్రిగా పని చేశారు.
మాణిక్యాలరావు ఫోటోగ్రాఫర్‌గా కెరీర్‌ను ప్రారంభించి అంచెలంచెలుగా మంత్రి స్థాయికి ఎదిగారు. తనకు కరోనా వచ్చిన విషయాన్ని జూలై 4న ఆయనే స్వయంగా తెలియజేశారు. ఈ వీడియో ద్వారా ఆయన ఈ వివరాలు తెలిపారు. మిత్రుడికి కరోనా సోకడంతో తన కార్యాలయంలో పని చేసే వారందరికీ కరోనా పరీక్షలు చేయించారు. ఈ క్రమంలో మాణిక్యాలరావుకు కరోనా పాజిటివ్ వచ్చింది.కరోనా వస్తే ఏం జరుగుతుందని అందరూ భయపడుతున్నారని, ఎవ్వరు కూడా భయాందోళన చెందవద్దని చెప్పారు. కరోనా గురించి అన్ని జాగ్రత్తలు చెప్పినా ఆయననే కరోనా బలి తీసుకుంది.
మాణిక్యాలరావు మృతిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 1989లో బీజేపీలో చేరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షులుగా పార్టీకి ఎన్నో సేవలందించారని ఆయన గుర్తు చేశారు. ఆయన మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.