తెలంగాణలో 90 మినీ ట్యాంక్ బండ్లు

By Newsmeter.Network  Published on  14 Jan 2020 6:12 AM GMT
తెలంగాణలో 90 మినీ ట్యాంక్ బండ్లు

ముఖ్యాంశాలు

  • తెలంగాణలో 90 మినీ ట్యాంక్ బండ్ల నిర్మాణం
  • రూ.319,51 కోట్లతో మినీ ట్యాక్ బండ్ల నిర్మాణం
  • ఇప్పటికే రూ.190 కోట్ల విలువైన పనులు పూర్తి
  • యుద్ద ప్రాతిపదికన జరుగుతున్న నిర్మాణం పనులు
  • చుట్టూ రక్షణ గోడలు, వాకింగ్ ట్రాక్ ల ఏర్పాటు
  • చుట్టూ సుందరమైన ఉద్యానాల ఏర్పాటు
  • టూరిస్ట్ ప్లేసులుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు
  • చిరు వ్యాపారులకు ఆలంబన మినీ ట్యాంక్ బండ్లు

హైదరాబాద్ : భూగర్భజలాలను అభివృద్ధి చేయడానికి, నీటి పారుదల సౌకర్యాలను పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ ప్రాజెక్ట్ లో భాగంగా మొత్తంగా తెలంగాణ రాష్ట్రమంతటా 90 మినీ ట్యాంక్ బండ్లను నిర్మించేందుకు విస్తృత స్థాయిలో కృషి చేస్తోంది. వివిధ పట్టణాలు నగరాల్లో ఈ ట్యాంక్ లను నిర్మిస్తున్నారు.

హైదరాబాద్ మినహా తెలంగాణలో దాదాపుగా అన్ని పట్టణాలూ, నగరాల్లో ఒకదాని తర్వాత ఒకటిగా ఈ మినీ ట్యాంక్ బండ్లను నిర్మిస్తున్నారు. హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ ఉన్న కారణంగా ఇంకో టాంక్ బండ్ నిర్మాణం అవసరంలేదని భావించారు. హుస్సేన్ సాగర్ ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Mini tank bunds

తెలంగాణలో మొత్తం 105 నియోజకవర్గాల్లో ఇప్పటికే మినీ ట్యాంక్ బండ్ల నిర్మాణంకోసం టెండర్లు పిలిచి రూ. 319.51 కోట్ల రూపాయల విలువైన పనుల్ని కేటాయించారు. నవంబర్ 2019 నాటికి రూ.190 కోట్ల రూపాయల విలువైన పనులు జరిగాయని అధికారులు చెబుతున్నారు. మినీ ట్యాంక్ బండ్ల నిర్మాణం పనులను యుద్ధ ప్రాతిపదినక పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోందంటున్నారు.

Mini tank bunds

నిజానికి ఈ చెరువులన్నీ దాదాపుగా కాకతీయుల పాలనలోగానీ లేక అసఫ్ జాహీల పాలనలోగానీ నిర్మించారు. శతాబ్దాలుగా వీటిపై సరైన శ్రద్ధ చూపించినవారు లేకపోవడంతో ఈ చెరువులన్నీ పూర్తిగా పాడైపోవడమే, కాలుష్యంలో కూరుకుపోవడమో లేక పూర్తిగా ఎండిపోవడమో జరిగింది. తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయలో భాగంగా పూర్తి స్థాయిలో ఈ చెరువులన్నింటినీ పునరుద్ధరించడమేకాక వీటిలోకి మురుగునీరు చేరడానికి వీల్లేకుండా పటిష్టమైన ఏర్పాటుల చేసింది.

మొత్తంగా ఈ 90 ట్యాంక్ బండ్లకూ రక్షణ గోడను నిర్మించడం, వాకింగ్ ట్రాక్స్ ని ఏర్పాటు చేయడం, చుట్టూ చక్కటి పార్కులను నిర్మించడం లాంటి ఆకర్షణీయమైన అభివృద్ధి పనులను తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా మొదలుపెట్టింది. దీనివల్ల స్థానికులకు అది తమ చెరువనీ, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యతకూడా తమదేననీ భావన కలుగుతుందని మంత్రి కేటీఆర్ చెబుతున్నారు.

పర్యావరణ లాభాల కోసమే..!

పునరుద్ధరించిన చెరువులు మళ్లీ ఆక్రమణలకు గురికాకుండా చూసే బాధ్యత పూర్తిగా స్థానిక మునిసిపాలిటీలదేనని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. చెరువులను అందంగా తీర్చిదిద్దడంవల్ల పర్యావరణ పరమైన లాభాలు అనేకం ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

Mini tank bunds

కేవలం అవి మాత్రమే కాక అక్కడి సుందరమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి వచ్చే స్థానికుల వల్ల చిరు వ్యాపారులకుకూడా ఉపాధి దొరుకుతుందని మంత్రి కేటీఆర్ అంటున్నారు. ఈ కారణాలవల్ల ఈ చెరువులను టూరిస్ట్ స్పాట్స్ గా అభివృద్ధి చేయాలని సంకల్పించామని చెబుతున్నారు.

మహబూబ్ నగర్, సిద్దిపేట, దుబ్బాక, భువనగిరి, సూర్యాపేట, ఆలేరు, నల్గొండ, ధర్మపురి, మానకొండూరు, సిరిసిల్ల, కోరుట్ల, జగిత్యాల్, వరంగల్, డోర్నకల్, ఖమ్మం నగరాల్లో ఇప్పటికే మినీ ట్యాంక్ బండ్ల నిర్మాణం చాలావరకూ పూర్తయ్యింది. కేవలం ఒక్క కరీంనగర్ లోనే 15 మినీ ట్యాంక్ బండ్లను నిర్మించడం విశేషం. వరంగర్ లో 13, నల్గొండలో 12 మినీ ట్యాంక్ బండ్లను నిర్మించాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది.

Mini tank bunds

సంగారెడ్డి, మహబూబ్ నగర్ లలో 11 చొప్పున, నిర్మల్ లో 10, రంగారెడ్డి ఖమ్మంలలో 9 చొప్పున, నిజామాబాద్ లో 8 మినీ ట్యాంక్ బండ్లను నిర్మిస్తున్నారు. దాదాపుగా ఇప్పటికే యాభై శాతం పనులు పూర్తయ్యాయనీ, పనుల్ని మరింత వేగవంతం చేస్తున్నామనీ అధికారులు చెబుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ఈ బృహత్తర యజ్ఞం పూర్తైతే శతాబ్దాలనాటి జలవనరులను పూర్తి స్థాయిలో కాపాడిన, అభివృద్ధి చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి కచ్చితంగా దక్కుతుంది. దీనివల్ల ప్రభుత్వం విస్తృత స్థాయి ప్రజాభిమానాన్ని చూరగొనగలుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Mini tank bunds

Next Story