10 లక్షలు దాటిన కరోనా కేసులు

By రాణి  Published on  3 April 2020 12:16 PM GMT
10 లక్షలు దాటిన కరోనా కేసులు

ముఖ్యాంశాలు

  • 53 వేలకు పైగా మరణాలు
  • అగ్రరాజ్యంపై కరోనా పంజా
  • లక్ష నుంచి రెండు లక్షల వరకూ మరణాలు ?
  • ప్రపంచవ్యాప్తంగా 30 శాతం ఆర్థిక సంక్షోభం

ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య శుక్రవారం మధ్యాహ్నానికి 10,26,974కు చేరుకుంది. మృతుల సంఖ్య 53,975 గా ఉంది. ఈ మరణాల సంఖ్యలో సగం ఇటలీ, స్పెయిన్ లోనే నమోదయ్యాయి. 2,17,433 మంది కోలుకుని ఇళ్లకు చేరారు. భారత్‌లో 2,088 కేసులు నమోదవ్వగా 156 మంది స్వస్థత పొందారు. 56 మంది మృతిచెందారు. కరోనా కారణంగా ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చనుందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇదే జరిగితే.. ప్రపంచంలో సగం ఆకలి చావులు తప్పవన్న సంకేతాలొస్తున్నాయి.

కంటికి కనిపించని ఓ సూక్ష్మక్రిమి ప్రపంచంపై చేస్తున్న దాడి అంతా ఇంతా కాదు. సగం ప్రపంచం వైరస్ తో పోరాడుతోంది. ఆర్థికంగా ప్రపంచం చాలా నష్టపోయింది. సూది మొన మీద ఈ వైరస్ క్రిములు కొన్ని కోట్ల సంఖ్యలో ఉంటాయంటే ఈ వైరస్ ఎంత సూక్ష్మంగా ఉంటుందో అర్థం చేసుకోండి. ప్రపంచ దేశాలు వైరస్ ప్రకోపానికి విలవిల్లాడుతున్నాయి. అగ్రరాజ్యం వైరస్ ధాటికి గజగజలాడుతోంది. అమెరికాలో 2,45,175 కరోనా కేసులు నమోదవ్వగా 10,403 మంది కోలుకున్నారు. మరో 6,059 మంది మృతి చెందారు. అయితే ఈ సంఖ్య లక్ష నుంచి 2.5 లక్షల వరకూ పెరగవచ్చని అమెరికా అభిప్రాయపడుతోంది. అక్కడ రోజురోజుకూ పెరుగుతున్న వైరస్ కేసుల సంఖ్య కలవరపాటుకు గురిచేస్తోంది.

ఇటలీలో విలయతాండవం చేసిన వైరస్..ఇప్పుడు అగ్రరాజ్యంపై విరుచుకుపడుతోంది. ప్రపంచ పెద్దన్న వైరస్ ను ఎలా అడ్డుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. లాక్ డౌన్ ప్రకటిస్తే..ఆర్థిక మాంద్యం పై దెబ్బపడుతుందన్న భయంతో ఇప్పటి వరకూ అలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకోలేదు.

పెరుగుతున్న నిరుద్యోగం

కరోనా మరణాల సంఖ్య అమెరికా, స్పెయిన్, బ్రిటన్ దేశాల్లో మరింత పెరిగే అవకాశాలెక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్పెయిన్ లో గురువారం ఒక్కరోజే 932 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో కరోనా కారణంగా చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించి, తాత్కాలికంగా మూసివేశాయి. దీంతో లక్షల మంది నిరుద్యోగులయ్యారు. ఉద్యోగాలు కోల్పోయినవారంతా మళ్లీ ఉద్యోగాన్వేషణలో పడటంతో..నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తులు చేసుకున్నవారి సంఖ్య 60 లక్షల మందికి పై చిలుకే. మరికొద్దిరోజుల్లో ఈ సంఖ్య కోటికి చేరనుంది. ఇక అమెరికా ఆర్థిక సంక్షోభంపై ఆర్థిక వేత్త ఇయాన్ షెఫర్డ్ సన్ ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని ఎలా చెప్పాలో తెలియడం లేదు..ఇంకా మార్చి, ఏప్రిల్ నెల జీతాలు తీసుకోని వారి సంఖ్య 1.6-2 కోట్లకు చేరుకోనుందని తెలిపారు షెఫర్డ్. కాగా..ఆ దేశంలో నిరుద్యోగ రేటు 13-16 శాతంగా ఉన్నట్లు వెల్లడించారు.

అలాగే అమెరికా, ఐరోపా ఆర్థిక వ్యవస్థలు సైతం 30 శాతం వరకూ పతనమవుతాయని రేటింగ్ సంస్థ ఫిచ్ పేర్కొంది. ఎందుకంటే ఉద్యోగాలు లేకపోవడంతో కొనుగోళ్లు మందగిస్తాయి. కొనుగోళ్లు మందగిస్తే..ఆర్థిక సంక్షోభం తప్పదు. తద్వారాదేశాల ఆర్థిక వ్యవస్థ అస్థవ్యస్తమవుతుంది. రస్‌తో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ 4.1 ట్రిలియన్‌ డాలర్లు అంటే ప్రపంచ ఉత్పత్తిలో ఐదు శాతం తగ్గుతుందని ఆసియా అభివృద్ధి బ్యాంకు శుక్రవారం హెచ్చరించింది. తమ దేశాల ఆర్థిక వ్యవస్థలను చక్కదిద్దేందుకు ఇప్పటికే అమెరికా, బ్రిటన్, భారత్ లతో పాటు ఇతర దేశాలు సైతం ఉద్దీపన పథకాలను ప్రకటించారు పాలకులు. అంతేకాదు..15 నెలల్లో అత్యవసర నగదు రూపేణా 160 బిలియన్ డాలర్ల ప్రణాళికను ఆమోదించనున్నట్లు ప్రపంచ బ్యాంక్ సైతం వెల్లడించింది.

అమెరికాలో రోజురోజుకీ కరోనా మరణాల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే 6 వేల మందికి పైగా మృతిచెందారు. గురువారం ఒక్కరోజే 1100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్యను చూస్తే ఎవరికైనా గుండెల్లో గుబులు పుట్టాల్సిందే. వైట్ హౌస్ విశ్లేషకులైతే ఈ మరణాల సంఖ్య లక్ష నుంచి రెండున్నర లక్షల వరకూ పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. వారి అంచనాల మేరకు ముందే లక్ష మృతదేహాల సంచులు కావాలని అమెరికా విపత్తు స్పందన సంస్థ ‘ఫెమా’ ఆ దేశ సైన్యాన్ని కోరడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అమెరికాలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నది న్యూయార్క్ లోనే. దీంతో అమెరికా ప్రజలు..ముఖ్యంగా న్యూయార్క్ వాసులెవరూ మాస్క్ లు లేకుండా బయట తిరగొద్దని నగర మేయర్ బిల్ డి బ్లేసియో, అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ విజ్ఞప్తి చేశారు.

Next Story