కోవిడ్‌-19 మహమ్మారి బెంబేలెత్తిస్తోన్న ఈ సమయంలో దేశమంతా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. పనులన్నీ నిలిచిపోయాయి. దీంతో.. వలస కార్మికులు వేల సంఖ్యలో పిల్లా జెల్లాతో కలిసి సొంతూళ్లకు వెళ్లేందుకు క్యూలు కడుతున్నారు. చాలామంది రోడ్డుమార్గంలో వందల కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తున్నారు. ఈ పరిస్థితులు గమనించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికుల కోసం శ్రామిక్‌ ట్రైన్లను ఏర్పాటు చేశాయి. గుర్తించిన వలస కార్మికులను సొంత ప్రాంతాలకు ఆ రైళ్లలో తరలిస్తున్నారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు ఇలా శ్రామిక్‌ ట్రైన్లను వినియోగించుకుంటున్నాయి.

ఈ క్రమంలోనే సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. పూర్తిగా జనంతో నిండిన ఒక రైలు వెళ్తున్న వీడియో అది. రైలు బోగీల్లో జనం నిండిపోవడంతో బోగీల మధ్యలో, ఇక.. రైలు పైన కూడా కిక్కిరిసిన రీతిలో జనం కూర్చున్నారు. రైలు ఇంజన్‌ ముందు భాగంలో కూడా పదులసంఖ్యలో జనం నిల్చున్నారు. కిటికీలు, డోర్లకు వేలాడబడ్డారు.
F2

ఈ వీడియోతో పాటు ఓ రైటప్‌ కూడా జోడించారు. అంతేకాదు.. వీడియోలోనే ఆ రైటప్‌ను రాశారు. Mumbai to westbengal migrant train 10/05/2020 అనే టెక్ట్స్‌ను వీడియో మొదటినుంచి చివరిదాకా చేర్చారు. అంటే.. ముంబై నుంచి పశ్చిమ బెంగాల్‌కు వలస కార్మికులు ఇలా రైలులో ప్రమాదకర స్థితిలో వెళ్తున్నారని దాని సారాంశం. లాక్‌డౌన్‌, ఉపాధి కోల్పోవడం వంటి కారణాలు ఇలాంటి పరిస్థితికి దారితీశాయన్న అర్థం వచ్చేలా ఈ వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు.

అయితే.. ఆ రైలును నిశితంగా గమనిస్తే విద్యుత్‌ రైలు కాదు అది. డీజిల్‌ ఇంజన్‌తో వెళ్తున్న రైలు. ముంబై నుంచి పశ్చిమ బెంగాల్‌కు వెళ్లే రూట్‌లో ఎలక్ట్రిఫికేషన్‌ ఉంది. కాబట్టి ఆ వీడియో ముంబైది కాదని, పైగా ఇప్పటిది కాదన్న అనుమానం మాత్రం కలుగుతోంది. ఎందుకంటే శ్రామిక్‌ ఎక్స్‌ప్రెస్‌లో వలసకూలీలను తరలించే సమయంలో పోలీసులు, రైల్వే అధికారులు సామాజిక దూరం ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో.. ఈ వీడియోను ఫ్యాక్ట్‌ చెక్‌ చేస్తే ఆసక్తికరంగా రిజల్ట్స్‌ వచ్చాయి.
F3

ఈ వీడియో భారత్‌కు చెందినది కాదు. బంగ్లాదేశ్‌కు సంబంధించినది. పైగా ఈ వీడియో రెండేళ్లక్రితం రికార్డ్‌ చేసింది. అయితే.. ఇదే వీడియోను చాలాసార్లు వేరే సందర్భాల్లో భారత్‌కు చెందిన రైలుగా క్లెయిమ్‌ చేసిన సందర్భాలు కూడా ఫ్యాక్ట్‌ చెక్‌ వెరిఫికేషన్‌లో కనిపించాయి. అంటే.. ఏదైనా సందర్భం వచ్చినప్పుడల్లా ఈ వీడియోను ఇలా వాడుకుంటున్నట్లు తేలింది.

==========================
ప్రచారం : ముంబై నుంచి పశ్చిమ బెంగాల్‌కు రైలులో ఇలా కిక్కిరిసి వెళ్తున్న వలస కార్మికులు
వాస్తవం : ఇది భారత్‌లో రైలు కాదు. బంగ్లాదేశ్‌కు చెందినది. రెండేళ్లక్రితం వీడియో.
కంక్లూజన్‌ : లాక్‌డౌన్‌ కారణంగా శ్రామిక్‌ ఎక్స్‌ప్రెస్‌లలో వలస కార్మికులు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి ఈ వీడియో తప్పుదోవ పట్టించేలా ఉంది.
========================
– సుజాత గోపగోని

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *