1700 కిలోమీటర్లు..16 గంటలు..7 రోజులు

By రాణి  Published on  12 April 2020 5:58 AM GMT
1700 కిలోమీటర్లు..16 గంటలు..7 రోజులు

కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన లాక్ డౌన్ తో చాలామంది వలస కూలీలు, లేబర్ కార్మికులు ఉపాధి కూలిపోయారు. ఇంటికి వెళ్లేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాల రవాణా లేదు. పోనీ ఏదైనా వాహనాన్ని అద్దెకు తీసుకుని వెళ్లాలంటే చెక్ పోస్టుల్లో ఆపి సీజ్ చేసేస్తున్నారు. చేసేది లేక వేలమంది వలస కూలీలు కాలి నడకనే స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. తాజాగా వలస కూలీగా పనిచేస్తోన్న ఓ యువకుడిదీ ఇదే పరిస్థితి. మరో మూడు నెలల వరకూ లాక్ డౌన్ ఇలాగే కొనసాగుతుందని విన్న అతను ఎలాగైనా ఇంటికి చేరుకోవాలన్న పట్టుదలతో తన సైకిల్ పై బయల్దేరాడు. కానీ ఇంటికి ఏ మార్గంలో వెళ్లాలో తెలియదు. తనకు గుర్తున్న కొన్ని రైల్వే స్టేషన్ల ఆధారంగా ఆఖరికి సొంత ఊరికి చేరుకున్నాడు.

Also Read : ఇవి తినండి..రోగనిరోధక శక్తిని పెంచుకోండి : ఆయుష్ మంత్రిత్వశాఖ

ఒడిశాలోని జాజ్ పూర్ జిల్లాకు చెందిన మహేశ్ జినా మహారాష్ట్ర సాంగ్లీ మిరాజ్ లోని ఒక పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఇంతలో వచ్చి పడిన కరోనా మహమ్మారితో లాక్ డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. ఇది ఇప్పుడప్పుడే తేలే విషయం కాదని అర్థం చేసుకున్న మహేష్ అక్కడే ఉంటే అనవసరంగా ఖర్చెక్కువ అవుతుందని భావించాడు. వెంటనే చేతిలో రూ.3000, తన సైకిల్ పై ఇంటివైపు సాగాడు. సైకిల్ పై అంతదూరం వెళ్లలేవని చెప్పినా వినలేదు. ఏప్రిల్ 1వ తేదీన బయల్దేరిన మహేశ్ రోజూ 16 గంటల పాటు 200 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ..ఏప్రిల్ 7వ తేదీకి సొంతఊరికి చేరుకున్నాడు.

Also Read : అందరూ లాక్ డౌన్ పొడిగింపుకే మొగ్గు..ఆ ఒక్క సీఎం తప్ప..

నిజానికి ఒంటరిగా ఉండేకన్నా సైకిల్ పై ప్రయాణమే బాగుందని మహేశ్ చెప్పిన మాటలు విన్నవారంతా ఆశ్చర్యపోయారు. సోలాపూర్, హైదరాబాద్, విజయవాడ, శ్రీకాకుళం మీదుగా ఒడిశాలోని స్వగ్రామానికి చేరుకున్నట్లు పేర్కొన్నాడు. తెల్లవారుజామున సైకిల్ తొక్కడం మొదలు పెడితే..మళ్లీ రాత్రికే ఆపేవాడినని, ఎంత ఎండవేసినా అలసిపోకుండా వచ్చానని చెప్పుకొచ్చాడు. రాత్రిపూట అక్కడక్కడా ఉన్న దేవాలయాలు, పాఠశాలల వద్ద నిద్రపోయేవాడినన్నాడు. రోడ్డు పక్కన ఎక్కడైనా ఫుడ్ కోర్ట్ లేదా దాబాలు తెరిచి ఉంటే అక్కడే తిని కడుపు నింపుకునేవాడినని తెలిపాడు. ఏప్రిల్ 7న ఇంటికెళ్లిన మహేశ్ ను స్థానిక అధికారులు క్వారంటైన్ కు తరలించారు.

Next Story