ఇండియాలో మిచెలిన్ స్టార్ స్ట్రీట్ ఫుడ్ రుచులు

By రాణి  Published on  13 Dec 2019 9:02 AM GMT
ఇండియాలో మిచెలిన్ స్టార్ స్ట్రీట్ ఫుడ్ రుచులు

రెండంటే రెండు డాలర్లకు మాంచి టేస్టీ స్ట్రీట్ ఫుడ్ ను పళ్లెం లోకి, ఆ తరువాత మీ పొట్టలోకి అందించే సింగపూర్ - హాంకాంగ్ ఫేమస్ మిచెలిన్ మీల్ ఇక నుంచి మన దేశంలోనూ లభించబోతోంది. సోయాసాస్, చికెన్, అన్నం, నూడుల్స్ తో తయారు చేసే ఈ హంకుగ్ బ్లే అనే స్టీట్ ఫుడ్ డిష్ త్వరలో ఢిల్లీ, హైదరాబాద్, ముంబైలలో లభించబోతోంది. దీని సృష్టికర్త, వీధి వంటకాల రారాజు చాన్ హోన్ మెంగ్ ఇప్పుడు ఈ అవుట్ లెట్స్ ను ప్రారంభిస్తున్నారు. హాకర్ చాన్ గా పేరొందిన ఈ స్ట్రీట్ షెఫ్ తన 30 ఏళ్ల “గరిటె తిప్పుడు” ను ఇండియాలోకి తెచ్చేస్తున్నాడు.

వచ్చిన వాళ్లను టేబుళ్లపై కూర్చోబెట్టి పావు గంట తరువాత ఆర్డర్ తీసుకుని, అరగంట తరువాత ప్లేట్లు, ఫోర్కులు పెట్టి, ముప్పావు గంట తరువాత వడ్డించి, గంట తరువాత నీళ్లిచ్చే కాస్ట్లీ హోటల్స్ కి పోటీగా చాన్ అడిగిన మరుక్షణం యమ్మీ టేస్టీ స్ట్రీట్ ఫుడ్ ను సర్వ్ చేసి ఆకలి తీరుస్తాడు. అదే హాకర్ చాన్ స్పెషాలిటీ.

చాన్ తన క్విక్ సర్వీస్ కాన్సెప్ట్ రెస్టారెంట్ ను 2009 లో సింగపూర్ లో మొదలుపెట్టారు. త్వరలోనే అది ఎంత పాపులర్ అయిపోయిందంటే వేలాది మంది ఫుడ్ లవర్స్ క్యూలు కట్టి మరీ కొనుక్కు తినడం మొదలుపెట్టారు. తరువాత బ్రాంచీలు మొదలయ్యాయి. ఆగ్నేయాసియా అంతటా విస్తరించాయి. చివరికి 2016 లో రెస్టారెంట్ల నోబెల్ ప్రైజ్ లాంటి మిచెలిన్ గైడ్ హాకర్ చాన్ కు స్టార్ ఇచ్చింది. దీంతో ప్రపంచంలోని మొదటి మిచెలిన్ స్టార్ పొందిన హాకర్ మీల్ గా దీనికి పేరొచ్చేసింది. ఇంత చీప్ గా వంటకాలను అమ్ముతూ అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారు ఇంకొకరు లేరు.

ఇప్పుడు సింగపూర్ టూరిజం బోర్డు మన దేశంలో ఏర్పాటు చేస్తున్న జోమాలాండ్ సెషన్ 2 లో భాగంగా డిసెంబర్ 13 నుంచి 15 దాకా హాకర్ చాన్ పర్యటించబోతున్నాడు. యమ్మీ యమ్మీ రుచులను అతి చవకగా అందిస్తూ అందరినీ అలరించబోతున్నారు.

Zomaland Food Festival ను Zomato సంస్థ ప్రారంభించింది. ఇది అతిపెద్ద ఫుడ్ ఫెస్టివల్. ఈ ఫుడ్ ఫెస్టివల్ కు వెళ్లాలనుకునేవారు ఆన్ లైన్ లో టికెట్లు కొనుక్కోవాల్సి ఉంటుంది.

Next Story