మెట్రో టికెట్ కోసం కౌంటర్ కి వెళ్లక్కర్లేదు..!
By రాణి Published on 23 Dec 2019 1:06 PM ISTహైదరాబాద్ లో మెట్రో పరుగులు మొదలై రెండేళ్లయింది. మియాపూర్ నుంచి ఎల్ బి నగర్, నాగోల్, ఇటు హైటెక్ సిటీ వరకూ మెట్రో పరుగులు పెడుతోంది. ఇందులో నిత్యం ప్రయాణించే వారి సంఖ్య వేల సంఖ్యలో ఉంటోంది. ముఖ్యంగా మొన్నటి వరకూ ఆర్టీసీ సమ్మె చేయడంతో మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసి పోయాయి. అయితే ఈ రైలులో ప్రయాణించేందుకు స్మార్ట్ కార్డు ఉన్నవాళ్లు సేఫ్ అయ్యారు. మిగతా ప్రయాణికులంతా టికెట్ కోసం క్యూ లైన్లలో నిల్చుని పడిగాపులు పడ్డారనే చెప్పాలి. అయితే ఎల్ అండ్ టీ మెట్రో ఇకమీదట క్యూ ఆర్ కోడ్ ద్వారా టికెట్ కొనుగోలు చేసే పద్ధతిని ప్రవేశ పెట్టనుంది. దీని వల్ల ఆన్ లైన్ లో టికెట్ కొనుగోలు చేసి మెట్రోలో ప్రయాణం చేయడం సులభమవుతుంది. కొత్తగా ప్రవేశ పెడుతున్న ఈ విధానాన్ని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ లో ప్రారంభించనున్నారు. స్మార్ట్ ఫోన్ ద్వారా ఆన్ లైన్ లోనే టికెట్ కొనుగోలు చేస్తే క్యూ ఆర్ కోడ్ రూపంలో టికెట్ మొబైల్ లో కనిపిస్తుంది. దానిని ఎంట్రీ గేట్ వద్ద చూపించి లోపలికి వెళ్లిపోవచ్చు.
వచ్చే నెల సంక్రాంతికి మెట్రోలో ప్రయాణించి రైల్వే స్టేషన్, ఎంజీబీఎస్ లకు చేరుకునే వరకు ఇది బాగానే ఉంటుంది. ఆ తర్వాత టికెట్ల కోసం ప్రయాణికులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. బస్సులో ఉండే సీట్ల కన్నా ప్రయాణికులే ఎక్కువగా ఉంటారు. అలాగే టైన్ లోని ఒక బోగీలో ఉండే సీట్ల కన్నా దానికి మూడింతలు ప్రయాణికులు ఉంటారు. సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇటు రాష్ర్ట ప్రభుత్వం, అటు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక బస్సులు, ట్రైన్లు నడిపినా ఏటా ఇదే పరిస్థితి. ఎన్ని స్పెషల్ సర్వీసులు నడిపినా ప్రయాణికులకు సరిపోవు. అందుకే రైల్వే స్టేషన్, బస్టాండ్లలో కూడా ఇలా క్యూ ఆర్ పద్ధతిని పెడితే రద్దీ సమయాల్లో టికెట్ల కోసం పడిగాపులు పడకుండా ప్రయాణికులు ఆన్ లైన్ టికెట్ తీసుకుని గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.