'క్రిస్మ‌స్' పండుగ ప్ర‌ధాన ఉద్దేశం అదే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Dec 2019 5:54 PM GMT
క్రిస్మ‌స్ పండుగ ప్ర‌ధాన ఉద్దేశం అదే..!

ఏసుక్రీస్తు జన్మ‌దినం సంద‌ర్భంగా డిసెంబరు 25న ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు జరుపుకునే పండుగ క్రిస్మ‌స్. క్రిస్టియన్ మ‌త‌స్థుల‌ కేలండర్ కి క్రిస్మస్ పండుగ‌ కేంద్రం లాంటిది. క్రైస్తవ కేలండర్‌లో అడ్వెంట్, నేటివిటీ వంటి ఉపవాస దినాల తర్వాత క్రిస్మస్ వ‌స్తుంది.

క్రిస్మస్ కథనం ప్రకారం.. రక్షకుని గురించిన జోస్యాలను అనుసరించి జోసెఫ్, మేరీ.. బెత్లెహేం వచ్చినప్పుడు వసతి గృహంలో గదులు దొర‌క‌క‌పోవ‌డంతో పశువుల పాకలో వారికి ఆశ్రయం దొరికింది, అక్కడే క్రీస్తు జన్మించాడు.

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో క్రిస్మస్ సెలవు రోజు. ఈ పండుగను క్రైస్తవుల్లో అత్యధికులు మతపరంగా.. క్రైస్తవేతరులు సాంస్కృతికంగానూ జరుపుకుంటారు.

క్రీస్తు ఏ నెలలో, ఏ తేదీన జన్మించాడన్న విషయం క‌చ్చితంగా తెలియకపోయినా... ప్రస్తుత కాలంలో క్రైస్తవుల్లో అత్యధికులు గ్రెగోరియన్ కేలండర్ లో డిసెంబరు నెల 25వ తేదీన క్రిస్మ‌స్ నిర్వహించుకుంటున్నారు.

ఇదిలావుంటే కొన్ని క్రైస్తవ చర్చిలు పాత జూలియన్ కేలండర్ ప్రకారం జూలియన్ డిసెంబరు నెల 25 తేదీన.. అంటే ప్రస్తుత గ్రెగోరియన్ కేలండర్‌లోని జనవరి 6 తేదీన జరుపుకుంటాయి. క్రైస్తవులు సరిగ్గా ఏసుక్రీస్తు ఏ తేదీన జన్మించాడో అదే తేదీన పండుగ చేసుకోవాలన్నది క్రిస్మస్ ప్రధాన కారణం కాదనీ, దేవుడు మానవ రూపంలో మానవ జాతి పాపాలను తొలగించడానికి భూమిపైకి వచ్చాడన్న కారణంగానే క్రిస్మస్ జరుపుకోవాలని, అదే క్రిస్మస్ పండుగకు ప్రధాన ఉద్దేశమ‌ని అంటారు.

వివిధ దేశాల్లో క్రిస్మస్ పండుగ సందర్భంగా వేడుకల్లో బహుమతులు ఇవ్వడం, క్రిస్మస్ కోసం ఎడ్వంట్ కేలెండర్ లెక్కించడం, ఎడ్వంట్ రెత్ పేరిట ఓ ఆకుపచ్చని ఆకులతో రింగ్ తయారుచేసి నాలుగు కానీ, ఐదు కానీ కొవ్వొత్తులు వెలిగించడం జ‌రుగుతుంది. అంతేకాకుండా క్రిస్మస్ సంగీతం, క్రీస్తు జననం ప్రదర్శన చ‌డ‌టం, సామూహిక ప్రార్థనలు, ప్రత్యేక విందు, క్రిస్మస్ చెట్టు, క్రిస్మస్ దీపాలు వెలిగించ‌డం వంటివి చేస్తారు.

దీనికితోడు శాంతా క్లాజ్, ఫాదర్ క్రిస్మస్, సెయింట్ నికొలస్, క్రైస్ట్ కైండ్ వంటి పాత్రలు పిల్లలకు బహుమతులు తీసుకురావడం వంటి వివిధ సంప్రదాయాలు, జానపద గాథలతో కూడి క్రిస్మస్ సంస్కృతిలో భాగంగా ఉన్నాయి.

Next Story