బెంగళూరు నగరంలోని ఓ ప్రముఖ హోటల్ ఇప్పుడు తన రూపు రేఖలు మార్చుకుంటోంది. ఒకప్పుడు సినీతారలు, వ్యాపార వేత్తలకు అత్యంత ఇష్టమైన హోటల్‌ ఇప్పుడు కొత్త మెరుగులు దిద్దుకుంటోంది. సిలికాన్ సిటీ బెంగళూరులో ఒక్క అడుగు భూమి విలువ లక్షల్లోనే ఉంటుంది. ఇక, వాణిజ్య, వ్యాపార, సినీ పరిశ్రమకు కేంద్రమైన ప్రాంతంలో దీని విలువ గురించి చెప్పనక్కర్లేదు. గాంధీనగర్‌లోని కోట్ల విలువచేసే ఈ ఆస్తిని యజమాని మీరా నాయుడు క్యాన్సర్‌తో బాధపడే బాలల సంక్షేమం కోసం దానం చేశారు. తన గొప్ప మనస్సు చాటుకున్నారు.

గాంధీనగరలోని లక్ష్మీ హోటల్‌ అంటే తెలియనవారు ఉండరు. గతంలో సినీ ప్రముఖులకు ఎంతో ఇష్టమైన ఈ హోటల్‌ లక్ష్మీ ఇకపై బాలల ఆరోగ్య కేంద్రంగా మారనుంది. ఈ హోటల్‌ను రూ.300 కోట్లు చెల్లించి కొనుగోలు చేయడానికి చాలా మంది ముందుకు వచ్చినా తిరస్కరించిన మీరానాయుడు.. కేన్సర్‌తో బాధపడే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేద బాలల కోసం ఆ భవనాన్ని కేటాయించాలని నిర్ణయించారు. అందుకోసం పేదలకు ఉచితంగా చికిత్స అందిస్తున్న నగరంలోని శంకర్‌ కేన్సర్ హాస్పిటల్‌కు దానంగా ఇచ్చారు.Meera Naidu Donated

తన భర్త శ్రీనివాసనాయుడు 1977లో ఈ 42 గదుల హోటల్‌‌ను కట్టించారని, ఆయన గౌరవార్ధం ఈ భవనాన్ని పేద బాలలకు దానం చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు మీరా నాయడు. క్యాన్సర్‌ చికిత్స కోసం వచ్చి నెలల తరబడి నగరంలో ఉండడం పేదలకు ఎంత కష్టమో తనకు తెలుసని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.

దీనిని పూర్తి స్థాయి ఆస్పత్రిగా మార్చకుండా, క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్న చిన్నపిల్లలు వారితో పాటు వచ్చిన వారు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నారులు, వారి తల్లిదండ్రులకు ఇక్కడే ఉచిత వసతి, భోజనం కల్పించనున్నారు.

ప్రస్తుతం కర్ణాటకలో ఏటా 600 మంది వరకు పిల్లల్లో క్యాన్సర్‌ను గుర్తిస్తున్నారు. ఒక్క ఏడాది పాటు చిన్నారికి చికిత్సను అందించాలంటే దాదాపు రూ.6లక్షలు ఖర్చవుతుంది. దీనిలో సగం కేవలం బెంగళూరులో నివసించేందుకే అయిపోతుంది. చాలా మంది కేవలం ఈ పై ఖర్చులకే భయపడి చికిత్స కూడా చేయించుకోరు. ఈ కేంద్రం ఏర్పాటైతే చికిత్స ఖర్చు సగానికి తగ్గిపోతుంది.

Newsmeter.Network

Next Story