మీ సేవా కేంద్రాలు మూతపడలేదు - అసలు నిజమేంటి ?
By Newsmeter.Network Published on 13 Dec 2019 4:47 PM ISTతెలంగాణలో మీ సేవా కేంద్రాలు మూతబడ్డాయన్న వార్త సోషల్ మీడియాలోనే కాదు.. న్యూస్ వెబ్‌సైట్లలో కూడా తెగ షికార్లు చేస్తోంది. ప్రధానస్రవంతి వార్తా పత్రికలు, న్యూస్ ఛానెళ్లకు సంబంధించిన వెబ్‌సైట్లలో కూడా ఈ వార్తను ప్రచురించారు. ఒకే ఒక్క రోజులో ఈ వార్త వైరల్ అయ్యింది. ఈనెల 13వ తేదీ శుక్రవారం నుంచి 16వ తేదీ సోమవారం వరకు మీ సేవా కేంద్రాలు మూతపడతాయన్నది ఆ సందేశం సారాంశం.
ఇదీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పోస్ట్ :
''మీ-సేవా డేటాబేస్ కార్యకలాపాలను మెరుగు పర్చనున్న కారణంగా శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు అంటే ఈనెల 16వ తేదీ వరకు బంద్ చేయనున్నట్టు మీ-సేవా కమిషనర్ ప్రకటించారు.రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం రాత్రి 7గంటల నుంచి 16వ తేదీ ఉదయం వరకూ మీ-సేవా కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్టు చెప్పారు. తిరిగి ఈనెల 16వ తేదీ ఉదయం 8గంటల నుంచి సేవలు అందుబాటులోకి వస్తాయని అదికారులు తెలిపారు.''
కొన్నేళ్లుగా పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ లావాదేవీలు, ఆన్‌లైన్ సేవలు కొనసాగుతుండటం, మీ సేవా కేంద్రాలు వాటికి వాహకాలుగా మారడం తెలిసిందే. ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఏ బిల్లు చెల్లించాలన్నా, ఏ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేయాలన్నా మీసేవా కేంద్రాలే కేరాఫ్ అడ్రస్‌లు అయ్యాయి. గతంలో ఏ ప్రభుత్వ కార్యాలయం చూసినా, ప్రధానంగా రెవెన్యూ ఆఫీసుల్లో నిత్యం జాతర వాతావరణం కనిపించేది. కానీ.. ఇప్పుడు అన్ని ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. అందుకే జనం మీసేవా సెంటర్లలో క్యూలు కడుతున్నారు. దీంతో.. సోషల్ మీడియా, వెబ్‌సైట్లు, ప్రధాన వార్తాస్రవంతి లింక్‌లలో కూడా మీసేవా కేంద్రాలు బంద్ అవుతున్నాయన్న వార్త రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అయిపోయింది. మీసేవా డేటాబేస్ కార్యకలాపాలు మొదలయ్యేందుకు ఒకరోజు ముందు ఈవార్త శరవేగంగా పాకింది.
కానీ, 13వ తేదీ ఉదయం దిన పత్రికల్లో ఓ వార్త ప్రచురితమైంది. మూడు రోజుల పాటు మీ సేవా కేంద్రాలు పూర్తిగా బంద్ అవుతాయని వచ్చిన వార్తల్లో నిజం లేదని ఇఎస్‌డి (ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ) కమిషనర్ జిటి వెంకటేశ్వర్‌రావు పేరిట ఖండన వచ్చింది. మీడియాతో పాటు సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం తప్పుడు ప్రచారమని, ప్రజలు ఈ విషయాన్ని నమ్మొద్దని వివరణ ఇచ్చారు. మీ సేవా డేటాబేస్ కార్యలాపాలు మెరుగుపరిచే క్రమంలో భాగంగా ఈనెల 13 వతేదీ శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి ఈనెల 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల వరకు కొన్ని సేవలు మాత్రమే అందుబాటులో ఉండవని, బిల్లుల చెల్లింపు సేవలు యధావిధిగా కొనసాగుతాయని, మీసేవా కేంద్రాల్లో కూడా బిల్లుల చెల్లింపు సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
అసలు.. ఈ ప్రచారం జరగడం వెనుక కారణముంది. ఈనెల 11వ తేదీన ఇఎస్‌డి (ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ) కమిషనర్ జిటి వెంకటేశ్వర్‌రావు తెలంగాణలో మీసేవా సర్వీసులు నిర్వహిస్తున్న పలు సంస్థలకు లేఖ రాశారు. మీసేవా డేటా బేస్ కార్యకలాపాలను అప్‌డేట్ చేస్తున్నామని, మూడు రోజుల పాటు.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని సేవల్లో అంతరాయం నెలకొంటుందని పేర్కొన్నారు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లో అడ్వాన్స్‌డ్ ఫీచర్లను జోడించబోతున్న సందర్భంగా ఈనెల 13 వతేదీ శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి ఈనెల 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల వరకు కొన్ని సేవలు అందుబాటులో ఉండవని వివరించారు. అయితే.. ఈసేవా సర్వీసులపై ప్రభావం ఉండబోదని అదే లేఖలో పేర్కొన్నారు కూడా.
కానీ.. మొదటగా పత్రికల్లో ప్రచురితమైన వార్తల్లో, వెబ్‌సైట్‌లలో పోస్టు చేసిన సందేశాల్లో ఆ అంశాన్ని విస్మరించారు. దీంతో.. మీసేవా కేంద్రాలు మొత్తానికి మూడు రోజుల పాటు మూతబడతాయన్న సంకేతాలు వెళ్లాయి. దీంతో.. మరోసారి.. ఇఎస్‌డి (ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ) కమిషనర్ జిటి వెంకటేశ్వర్‌రావు వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
ప్రచారం : తెలంగాణలో మూడు రోజుల పాటు మీసేవా కేంద్రాలు మూతబడతాయి
వాస్తవం : కొన్ని సేవలు మాత్రమే పనిచేయవు. మీసేవా కేంద్రాలు, ఈ సేవలు అందుబాటులో ఉంటాయి
కంక్లూజన్ : మొదట విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఒక వాక్యాన్ని విస్మరించడం వల్ల తప్పుడు ప్రచారం వైరల్‌గా మారింది.
- సుజాత గోపగోని