అమరావతి : గురువారం జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కొద్దిసేపు అధికార పక్ష నేతకు, ప్రతిపక్ష నేతకు మధ్య మీడియాకు సంబంధించి మాటల యుద్ధం జరిగింది. జగన్ కు సంబంధించిన సాక్షి పేపర్ లో తనపై ఇష్టారాజ్యంగా వార్తలు రాస్తున్నారని, తాను అనని మాటలు కూడా అన్నానని రాసుకొచ్చారని చంద్రబాబు మాట్లాడుతుండగా జగన్ ఆయనపై ఫైర్ అయ్యారు. న్యూస్ పేపర్ అనేది ఒక వ్యవస్థ అని, మీకు సపోర్ట్ చేసే పేపర్లు మీ గురించి పొగుడుతూ ఎలా రాస్తాయో మాకు ఉన్న పేపర్లు అందుకు వ్యతిరేకంగా రాస్తాయన్నారు. వాటి గురించి అసెంబ్లీలో మాట్లాడరాదన్నారు. ఒక పేపర్ లో ఇలా రాయకూడదని ఎవరూ శాసించకూడదన్నారు. చంద్రబాబుకు కనీసం బుద్ధి లేదని జగన్ దూషించారు. పత్రికా స్వేచ్ఛను ఆయన హరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాజకీయనాయకులకు సంబంధించిన ఛానెళ్లు చాలానే ఉన్నాయని, చంద్రబాబు మాట్లాడేది చూస్తే ఎవరూ వారి ఛానెళ్లలో గొప్పలు చెప్పుకోవద్దన్నట్లే ఉందని విమర్శించారు.

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సాక్షి పేపర్ ఓ చెత్త పేపర్ అని దూషించారు. ఎంత సేపు జగన్ గురించి డప్పు కొట్టడం తప్ప అందులో ప్రజలకు పనికొచ్చే విషయాలేమీ ఉండవని విమర్శించారు. ఇంగ్లీష్ మీడియంకు తానెప్పుడూ వ్యతిరేకం కాదని చెప్పినా…సాక్షి పేపర్ లో ఇష్టారాజ్యంగా వార్తలు రాశారని, అసెంబ్లీలో తన ప్రవర్తన బాలేదని రాసుకొచ్చారని చంద్రబాబు స్పీకర్ కు వివరించారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.