మేడారం జాతరలో భక్తులు తమకు తోచిన కానుకలను సమర్పించుకునేందుకు ఏర్పాటు చేసిన హుండీల లెక్కింపు ప్రక్రియ వారంరోజులుగా జరుగుతోంది. పూర్తిగా హుండీల లెక్కింపు అవ్వకుండానే మేడారం జాతరలో వచ్చిన ఆదాయం రికార్డ్ బ్రేక్ చేసింది. 2018లో రూ.10 కోట్ల 17 లక్షల 50 వేల 363 ల ఆదాయం రాగా..ఈ ఏడాది ఆదాయం దాని రికార్డును బద్దలు కొట్టింది. మొత్తం 494 హుండీలకు గాను..ఏడవ రోజుకి 420 హుండీల లెక్కింపు పూర్తయింది. ఇప్పటి వరకూ లెక్కించిన హుండీల ఆదాయం రూ.10కోట్ల 29 లక్షల 92 వేలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మిగతా 74 హుండీల ఆదాయాన్ని లెక్కించేందుకు మరో రెండ్రోజుల సమయం పడుతుందని వారు పేర్కొన్నారు.

ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 8 తేదీ వరకూ జరిగిన మేడారం జాతరకు తెలంగాణ నలుమూలల నుంచే కాక..ఇతర రాష్ర్టాల నుంచీ కూడా భక్తులు తరలి వచ్చి..వనదేవతలను దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్, రాష్ర్ట హోంమంత్రి, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులంతా అమ్మలను దర్శించుకుని నిలువెత్తు బంగారం (బెల్లం)ను సమర్పించారు. ప్రజల కోసం టీఎస్ ఆర్టీసీ స్పెషల్ సర్వీసులను నడిపింది. ఆర్టీసీకి సాధారణంగా వచ్చే ఆదాయానికన్నా..మేడారం జాతర సందర్భంగా వచ్చిన ఆదాయమే ఎక్కువ. సందట్లో సడేమియా లాగా..ప్రభుత్వ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులు..షేర్ ఆటోలు కూడా మేడారం జాతరను సొమ్ము చేసుకున్నాయి. భక్తులు హెలికాఫ్టర్ ద్వారా వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేశారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.