కొనసాగుతున్న మేడారం హుండీల లెక్కింపు.. ఇప్పటి వరకు ఎంత ఆదాయం వచ్చిందంటే..

By Newsmeter.Network  Published on  16 Feb 2020 9:06 AM GMT
కొనసాగుతున్న మేడారం హుండీల లెక్కింపు.. ఇప్పటి వరకు ఎంత ఆదాయం వచ్చిందంటే..

మేడారం జాతర హుండీలన్నీ భక్తుల కానుకలతో నిండిపోయాయి. హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో హుండీ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రూపాయి నాణేల నుంచి రూ.2వేల నోట్ల వరకు హుండీల్లో భక్తులు సమర్పించుకున్నారు. అంతేకాక, విదేశీ కరెన్సీతో పాటు రద్దయిన పాత రూ.500 నోట్లు కూడా హుండీల్లో బయటపడుతున్నాయి. బంగారు కడియాలు, వెండి కడియాలు, కుంకుమ భరిణెలు, వివిధ ప్రతిమలు అమ్మవార్లకు భక్తులు సమర్పించుకున్నారు.

బుధవారం నుంచి లెక్కింపు ప్రారంభమవగా.. శనివారం నాటికి హుండీల నుంచి రూ.7 కోట్ల ఆదాయం ఎండోమెంట్‍ అకౌంట్​లో జమైంది. మరో వారం పాటు లెక్కింపు కొనసాగనుంది. 2018 జాతరలో హుండీల నుంచి రూ.10.70 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మేడారం జాతరలో అధికారులు మొత్తం 494 హుండీలను ఏర్పాటు చేశారు. 452 మామూలు హుండీలు, 24 బట్టతో చేసిన హుండీలు, మరో మూడు వడిబియ్యం హుండీలు ఉంచారు. జాతర ముగిశాక పటిష్ఠ భద్రత నడుమ వీటన్నింటినీ హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. ప్రతిరోజు 300 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. ఇప్పటివరకు 247 హుండీల్లోని కానుకలను లెక్కించినట్లు దేవాదాయశాఖ అడిషనల్ కమిషనర్‍ శ్రీనివాసరావు చెప్పారు.

ఆదాయంలో మూడోవంతు గిరిజన పూజారులకే

ఆదివాసీ సంప్రదాయం ప్రకారం మేడారం జాతరలో భక్తుల నుంచి వచ్చే కానుకల ఆదాయంలో ప్రధాన పూజరుల కుటుంబాలకు కొంత వాటా ఉంది. మొత్తం ఆదాయంలో మూడో వంతు(33.33 శాతం) వారికి ఇవ్వాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. 2018 జాతర సమయంలో లెక్కింపునకు వారం టైం పట్టగా.. ఈసారి హుండీల్లోకి వర్షపు నీరు చేరడం, బెల్లం, బియ్యంతో నోట్లన్నీ అతుక్కుపోతుండటంతో వాటిని శుభ్రపరచడానికి ఎక్కువ సమయం పడుతోందని ఆయన తెలిపారు.

హుండీలు తెరిచేందుకు ఓ టీం.. అందులోని నోట్లు, వెండి, బంగారు వస్తువులను వేరు చేయడానికి మరో టీం.. బెల్లం, పసుపు, కుంకుమ అంటిన నోట్లను, వస్తువులను శుభ్రం చేసేందుకు మరో బృందంగా ఏర్పడ్డారు. నోట్లను కట్టలుగా కట్టేందుకు మరో బ్యాచ్ కూడా ఉంది. ఇలా బ్యాఛ్ లుగా విడిపోయి లెక్కింపు చేపట్టారు. లెక్కింపు కోసం వచ్చే సిబ్బందికి ప్రత్యేక డ్రెస్ కోడ్ పెట్టారు. మహిళా సిబ్బందికి మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఇచ్చారు.

Next Story