ఆనంద్ మహీంద్రను కదిలించిన ఓ కథ..!
By సత్య ప్రియ Published on 23 Oct 2019 11:16 AM GMTతల్లి ఎవరికైనా తల్లే... కానీ అతను తల్లి కోసం చేసిన పని చూస్తే ఎవెరి గుండె అయినా కరగకమానదు. అదే జరిగింది... అతని కధ విని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను కూడా కదిలించింది.
అతని పేరే దక్షిణామూర్తి కృష్ణ కుమార్, కర్ణాటకలోని మైసూర్ వాసి. ఆయన తల్లి సాధారణ గృహిణి. తన 70 ఏళ్ల జీవితంలో ఏనాడు బయట ఊరికి వెళ్లింది లేదు. ఒకరోజు మాటల సందర్భంలో ఇదే విషయాన్ని దక్షాణామూర్తికి చెప్పింది. కనీసం ఇంటికి దగ్గరలో ఉన్న సుప్రసిద్ధ దేవాలయం బేలూరు హలిబేడును కూడా చూడలేదని అనడంతో.. ఆయన ఓ నిర్ణయానికి వచ్చారు. ‘మాతృసేవా సంకల్ప్ యాత్ర’ పేరుతో స్కూటర్‌పై సుమారు 18 రాష్ట్రాలు, మూడు దేశాలు తిప్పి చూపించాడు.
దీనికోసం ఆయన 20 ఏళ్ల క్రితం నాటి స్కూటర్‌ను ఎంచుకున్నారు. అది ఆయన తండ్రి కొన్న స్కూటర్. నాలుగేళ్ల క్రితం ఆయన మరణించారు. ఈ ప్రయాణంలో తమతో పాటు తన తండ్రి ఉంటారనే భావనతో స్కూటర్‌ను ఎంచుకున్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే.. ‘‘మేం ముగ్గురు కలిసి ప్రయాణించినట్టే ఉంటుంది. ఆయన లేరనే ఆలోచన నాకు అస్సలు లేదు’’ అంటూ ఉద్వేగానికి గురయ్యారు.
కేరళ నుంచి మొదలు పెట్టుకుని అరుణాచల్ ప్రదేశ్ వరకు దాదాపు అన్ని ప్రాంతాలు చుట్టేశారు. అలా 2018 జనవరి 18న ప్రారంభమైన వీరి ప్రయాణం.. 48,100 కిమీ లు పూర్తి చేసింది. దేశంలోని ప్రముఖ క్షేత్రాలన్నింటినీ దర్శించుకున్నారు. దేశంలోని ప్రాంతాలనే గాక, సరిహద్దు దేశాలైన మయన్మార్, భూటాన్, నేపాల్‌కు కూడా వెళ్లొచ్చారు. దేవాలయాలు, సుప్రసిద్ధ ప్రాంతాలను ఆమెకు కృష్ణ కుమార్ చూపించారు.
ఈ విషయాన్ని నాంది ఫౌండేషన్ అధినేత మనోజ్ కుమార్ ట్వీట్ చేయగా, దాన్ని మహీంద్ర సంస్థల అధినేత ఆనంద్ మహీంద్ర రీట్వీట్ చేస్తూ... ‘‘ఇది అందమైన కథ. ఇందులో మాతృప్రేమ మాత్రమే కాదు.. దేశభక్తి కూడా దాగుంది. షేర్ చేసినందుకు కృతజ్ఞతలు మనోజ్. అతన్ని నాకు పరిచయం చేస్తే.. మహీంద్రా కేయూవీ 100 ఎన్ఎక్స్‌టీ బహూకరిస్తాను. తమ తర్వాతి యాత్రను దానిలో చేయొచ్చు’’ అన్నారు. తల్లి ప్రేమను ఇంత అద్భుతంగా చాటుకున్న కృష్ణ కుమార్ కి అందమైన బహుమానం అవుతుందని ఆశిద్దాం.