అక్తర్ రికార్డ్ బద్దలు కొట్టిన జూనియర్ మలింగా..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 Jan 2020 11:55 AM GMTమతీషా పతిరాణా.. ఈ పేరు ఇప్పుడు క్రికెట్‌లో మారుమోగుతుంది. నాలుగు నెలల క్రితం వరకూ శ్రీలంక కాలేజ్ స్థాయి క్రికెట్ ఆడిన ఈ కుర్రాడు ఒక్క మ్యాచ్‌తో యావత్త్ క్రీడా ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. శ్రీలంక సీనియర్ పేసర్ లసిత్ మలింగా తరహా బౌలింగ్ యాక్షన్‌ను పోలి ఉండే పతిరాణా.. నిన్న యువ భారత్‌తో జరిగిన అండర్-19 క్రికెట్ మ్యాచ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు.
కాగా, గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన ఓ కాలేజ్ మ్యాచ్‌లో పతిరాణా 7 పరుగులిచ్చి 6 వికెట్లు సాధించాడు. మలింగా తరహాలోనే పతిరాణా కూడా ప్రధానంగా యార్కర్లనే తన ఆయుధంగా చేసుకుని బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమటలు పట్టిస్తాడు. అటువంటి ప్రదర్శనే.. పతిరాణా క్రికెట్ ఎంట్రీకి కారణమైంది.
అయితే.. ఆదివారం భారత్-19 జట్టుతో జరిగిన మ్యాచ్‌లో మతీషా పతిరాణా.. వికెట్ తీయకున్నా ప్రపంచ రికార్డ్ సాధించాడు. పాక్ స్పీడ్‌స్టర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్.. ఫాస్టెస్ట్ బాల్ రికార్డును పతిరాణా బద్దలుకొట్టాడు. గంటకు 175 కి.మీ వేగంతో బంతిని విసిరి సరికొత్త వరల్డ్ రికార్డును నెలకొల్పాడు.
పతిరాణా విసిరిన బంతే.. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఏ స్థాయిలోనైనా ఫాస్టెస్ట్ బాల్. మ్యాచ్ ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో యశస్వి జైశ్వాల్ బ్యాటింగ్ చేస్తుండగా పతిరాణా ఈ బంతి సంధించాడు. అయితే ఆ బంతి వైడ్ బాల్ కావడం విశేషం. అంతకుముందు 2003 ప్రపంచకప్‌లో షోయబ్ అక్తర్ 161.3 కి.మీ వేగంతో వేసిన బంతే ఫాస్టెస్ట్ బాల్. దాన్ని పతిరాణా బ్రేక్ చేశాడు.