ఇక బయటకు వస్తే మాస్క్‌లు అవసరం లేదు.. అక్కడి ఆరోగ్యశాఖ కీలక ప్రకటన
By సుభాష్ Published on 21 Aug 2020 11:48 AM GMTప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా కట్టడికి ప్రపంచ దేశాలు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా.. ఇంకా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక తొలి కేసు నమోదైనా చైనాలో పరిస్థితులు ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. చైనాలోని వుహాన్ నగరంలో ఇటీవల ఓ వీకెండ్ పార్టీలో జలకాలాటల్లో అక్కడి జనం మునిగి తేలగా, ఇప్పుడు చైనా రాజధాని బీజింగ్‌లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటి వరకూ బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్‌లను ధరించడం తప్పనిసరి చేసిన బీజింగ్ అధికార యంత్రాంగం.. తాజాగా ఆ నిబంధనను ఎత్తివేసింది. మాస్కులు లేకుండా బయటకు వెళ్లవచ్చని స్పష్టం చేసింది. వరుసగా 13 రోజుల పాటు బీజింగ్‌లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాకపోవడంతో వైద్య ఆరోగ్యశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అక్కడి ప్రజలు మాత్రం మాస్క్‌లు అవసరం లేదని అధికారులు తెలిపినప్పటికీ మాస్క్‌లు ధరించే బయటకు వెళ్తున్నారు. దీని వల్ల తమకు భద్రంగా ఉన్నమనే భావన కలుగుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మాస్క్‌లు లేకుండా బయట తిరిగితే ప్రజలు అనుమానంగా, భయంతో చూస్తున్నారని, దీంతో ఇప్పటికీ తాము మాస్క్‌లు ధరించాల్సి వస్తోందని మరికొందరు అంటున్నారు.
బీజింగ్‌లోని బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి కాదని అక్కడి అధికారులు ప్రకటించడం ఇది రెండోసారి. రెండు విడతలుగా లాక్‌డౌన్ విధించిన తర్వాత పరిస్థితులు అదుపులోకి రావడంతో గత ఏప్రిల్‌లో కూడా బీజింగ్‌లోని అతిపెద్ద హోల్‌సెల్ మార్కెట్‌లో కరోనా పాజిటివ్ కేసులు బయట పడటంతో మరోసారి లాక్‌డౌన్ విధించారు. అప్పటి నుంచి బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు తప్పనిసరి చేశారు.