మసీదులో హిందూ దంపతుల వివాహం

By సుభాష్  Published on  20 Jan 2020 3:13 PM GMT
మసీదులో హిందూ దంపతుల వివాహం

ముఖ్యాంశాలు

  • హిందూ దంపతుల పెళ్లిక వైదికైన మసీదు

  • మసీదులో పచ్చని తోరణాలతో అలంకరణ

  • వేదమంత్రోచ్ఛారణల మధ్య మసీదులో వివాహం

  • మసీదు పెద్దలను ప్రశంసించిన కేరళ సీం

సామాన్యంగా మసీదులలో వివాహాలు జరగవు. పెళ్లి బాజాలు మోగవు. అలాంటిది ఓ మసీదు పెళ్లి మండపంలా మారిపోయింది. ఈ అరుదైన ఘటన కేరళలోని అళప్పుజలో చోటు చేసుకుంది. ఈ వివాహానికి అళప్పుజలోని చెరువల్లి ముస్లిం జమాతే మసీదు వేదికైంది. ఈ మసీదు వేదికగా హిందూ సంప్రదాయంలో ఓ జంట ఒక్కటైంది. ఈ వివాహ వేడుకకు ఖర్చంత ముస్లిం జమాతే మసీదు పెద్దలు భరించడం విశేషం. మసీదు కమిటీ ఆర్థిక సహాయంతో వధువు అంజు, వరుడు శరత్‌ వివాహం జరిగింది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువతి అంజు ఐదేళ్ల క్రితం తండ్రి అశోకన్‌ మృతి చెందాడు. తల్లి బిందు చిన్నపాటి వ్యాపారం చేసుకుంటూ కూతురితో జీవనం కొనసాగిస్తోంది. కాగా, కుమార్తెకు వివాహం చేసేందుకు డబ్బులు లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని మసీదు పెద్దల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వారు మసీదు కమిటీ తరపున ఐదు లక్షల రూపాయలతో ఆమె కుమార్తె పెళ్లి జరిపించారు. మసీదులో పచ్చని తోరణాలు అలంకరించి అంజు, శరత్‌ల వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం పురోహితుల సమక్షంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య ఈ పెళ్లి ఘనంగా జరిపించారు.

2500 మందికి భోజనాలు

మసీదులో హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్లిలో మసీదు కమిటీ వారు 2500 మందికి పైగా భోజనాలు ఏర్పాటు చేశారు. అలాగే పెళ్లికి వచ్చిన వారందరికీ హిందూ సంప్రదాయాలకు అనుగుణంగానే విందు భోజనాలు వడ్డించారు. ఈ వివాహం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. ఒక హిందూ సంప్రదాయబద్దంగా మసీదులో ముస్లిం పెద్దలు ఖర్చు పెట్టి వివాహం జరిపించడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Hindu Wedding

ముఖ్యమంత్రి ప్రశంసలు

ఇక కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సైతం ఫేస్‌ బుక్‌ వేదికక ప్రశంసలు కురిపించారు. అంతేకాదు పెళ్లికి సంబంధించిన ఫోటోను కూడా జత చేసి పోస్టు చేశారు. కేరళ రాష్ట్రంలో మత సామరస్యానికి పెట్టింది పేరని హర్షం వ్యక్తం చేశారు. అన్ని కులాలు, మతాలు ఒక్కటే అని చెప్పడానికి ఇదే ఉదాహారణ అని చెప్పుకొచ్చారు. వివాహం జరిపించిన మసీదు కమిటీ సభ్యులకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. మసీదులో హిందూ దంపతులకు జరిగిన వివాహం కేరళలో మతసామరస్యం వెల్లివిరిసింది.

Next Story