మేరీకోమ్ అనుభవం ముందు త‌ల‌వంచిన జరీన్‌.. మ్యాచ్‌ అనంత‌రం మ‌రో ఫైట్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Dec 2019 12:29 PM GMT
మేరీకోమ్ అనుభవం ముందు త‌ల‌వంచిన జరీన్‌.. మ్యాచ్‌ అనంత‌రం మ‌రో ఫైట్..!

మ‌రోమారు అనుభవమే గెలిచింది. సీనియర్‌ పంచ్‌కి జూనియర్ త‌ల‌వంచింది. మేరీ కోమ్‌తో తలపడి గెలవాలనుకున్న తెలంగాణ యువ మ‌హిళా బాక్స‌ర్‌ నిఖత్‌ జరీన్‌ ఆశలు ఆవిరయ్యాయి. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ గా ప‌రుగులు పెడుతున్న మేరికోమ్ ముందు.. ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న‌ తెలంగాణ అమ్మాయి ఘోరంగా ఓడింది. అయితే మ్యాచ్ అనంత‌రం మేరీకోమ్ తీరు తీవ్ర విమ‌ర్శ‌లకు దారి తీస్తుంది. ఎంతో అనుభ‌వ‌మున్న మేరీ అస్స‌లు క్రీడాస్ఫూర్తిని ప్ర‌ద‌ర్శించ‌లేదు. దీనిపై స‌ర్వ‌త్రా వెలువ‌డుతున్నాయి.

మ్యాచ్‌కు ముందు నిఖ‌త్ జ‌రీన్.. ఎట్టకేలకు మేరీకోమ్‌తో తలపడే అవకాశం వ‌చ్చింది. ఇది మరపురాని మ్యాచ్‌గా నిలిచేలా చూస్తా. నిజాయితీగా ఆడతాన‌ని వ్యాఖ్యానించింది. ఒక రకంగా ఆమె ఆశలు అడియాశలయ్యాయనే చెప్పాలి. ఈ మ్యాచ్‌లో మేరీకోమ్‌ చేతిలో నిఖ‌త్ ఘోర పరాజయం చవిచూసింది. దీంతో వచ్చే ఏడాది చైనాలో జరిగే ఒలింపిక్స్‌ అర్హత పోటీలకు అర్హ‌త సాధించ‌లేక‌పోయింది.

ఇదిలావుంటే.. మ్యాచ్ అనంత‌రం జరీన్‌.. మేరీకోమ్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించింది. అందుకు సీనియ‌ర్ అయిన మేరీకోమ్‌ నిరాకరించింది. మ్యాచ్ అనంత‌రం ఈ విష‌య‌మై మేరీకోమ్‌ స్పందించింది. జరీన్‌ తో తానెందుకు చేతులు కలపాలి? అని ఫైర్ అయ్యింది. ఇతరులు ఆమెను గౌరవించాలంటే.. ఆమె ఇతరులను గౌరవించాల‌ని.. అలాంటి స్వభావం లేనివారు తనకు నచ్చరని.. తన బలమేంటో రింగ్‌లో చూపాలి కాని బయట కాదని మేరీకోమ్ అంటుంది.

ఇదే విషయమై జరీన్ స్పందిస్తూ.. మేరీకోమ్ నాతో వ్యవహిరించిన తీరు నచ్చలేదని.. ఫలితం ప్రకటించాక మేరీకోమ్‌ను హత్తుకోవాలని చూశానని చెప్పింది. అయితే.. ఆమె అందుకు నిరాకరించిందని, ఒక జూనియర్ బాక్సర్‌గా సీనియర్ల నుంచి గౌరవం దక్కుతుందని ఆశించానని నిఖత్‌ తెలిపింది. మేరీ ఇలా వ్యవహరించడం తనను కలచివేసిందని నిఖ‌త్ జ‌రీన్ వివరించింది.

రెండు నెలల క్రితం బాక్సింగ్‌ సమాఖ్య.. ఒలింపిక్స్‌కు మేరికోమ్‌ను పంపిస్తామని ప్రకటించడంతో వీరిద్దరి మధ్య వివాదం మొదలైంది. మేరికోమ్‌ని ఎలా పంపిస్తారని.. తనతో ట్రయల్స్‌ నిర్వహించాలని జరీన్ ప్ర‌శ్నించింది. దీనిపై కేంద్ర క్రీడామంత్రికి లేఖ రాసింది. దీనిపై మొద‌టి నుండి గుర్రుగా ఉన్న మేరీకోమ్.. మ్యాచ్ అనంత‌రం ఒక్క‌సారిగా నిఖ‌త్‌పై త‌న అక్క‌సును వెళ్ల‌గ‌క్కింది.

Next Story
Share it