కళ్ళముందే కూల్చేశారుగా..!
By Newsmeter.Network Published on 13 Jan 2020 2:40 AM GMTతిరువనంతపురం: ఆపరేషన్ డిమోలిషన్‌ను కేరళ ప్రభుత్వం సక్సెస్ చేసింది. కొచ్చిలో తీరప్రాంత జోన్ నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా నిర్మించిన నాలుగు భారీ భవనాలను రెండు రోజుల్లో కూల్చివేసి సుప్రీంకోర్టు ఆదేశాలను పక్కాగా అమలు చేసింది.. శనివారం నాడు 2 భవనాలను శక్తిమంతమైన పేలుడు పదార్థాలతో కొన్ని క్షణాల్లోనే కూల్చిన ప్రభుత్వ అధికారులు ఆదివారం మిగిలిన రెండు భవనాలను నేలమట్టం చేశారు. సమీప నివాసితులు ఎత్తైన భవనాల నుంచి ఈ తతంగాన్ని కళ్లారా చూశారు. పేలుడు అనంతరం ఒక్కసారిగా దుమ్ము మేఘాలు కమ్ముకుని అనంతరం అక్కడి ఎత్తైన భవనాలు క్షణాల్లో రాళ్లకుప్పలుగా మారడాన్ని వీక్షించి ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా అధికారులు పలు జాగ్రత్తలు పాటించారు. కూల్చివేత ప్రాంతానికి 200 మీటర్ల పరిధిలోని నివాసితులను ఖాళీ చేయించడంతో పాటుగా 144 సెక్షన్ విధించారు. ఆ వైపు వెళ్లే రోడ్డు మార్గాలన్నింటినీ ఉదయం నుంచి సాయంత్రం వరకు మూసివేశారు.
కూల్చివేత అనంతరం ఎక్కువగా దుమ్ము రేగకుండా, నిర్మాణ శిథిలాలు సమీప సరస్సులోకి వెళ్లకుండా, సమీప భవనాలు ఏమాత్రం దెబ్బతిన్నకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. సామాన్య ప్రజలు ఎవరూ ఆ ప్రాంతంలో కనిపించకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఆపరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు తమ ఇళ్లల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారు. అంతేకాదు అన్ని కిటీకీలను, తలపులను మూసివేయాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక కూల్చే సమయంలో వారందరినీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించారు. ఇక అపార్ట్‌మెంట్లలోని ప్రజలు ఖాళీ చేసిన తర్వాత , అధికారులు ఆ ఫ్లాట్స్‌కు సంబంధించిన కిటికీలు తలపులను వేరు చేశారు.నాలుగు అక్రమ భవన నిర్మాణాలను సురక్షితమైన నియంత్రణ పద్ధతిలో నేలమట్టం చేసేందుకు సుమారు 750 కేజీల పేలుడు పదార్థాలు వినియోగించినట్లు అధికారులు తెలిపారు. ఎర్నాకుళం జిల్లా కలెక్టర్ ఎస్ సుహాస్, కొచ్చి పోలీస్ కమిషనర్ విజయ్ సాఖరే ఈ కూల్చివేతలను పర్యవేక్షించారు.
ముంబైకి చెందిన ఎడిపైసెస్ ముడు భవనాల కూల్చివేత పనులు చేపట్టగా, చెన్నైకి చెందిన విజయ్ స్టీల్స్ సంస్థ జంట టవైర్లెన అల్ఫా సెరేన్‌ను నేలమట్టం చేసినట్లు అధికారులు వివరించారు. కోస్టల్ సిటీలో లెక్కకు మిక్కిలి రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి. ‘ మరాదూ ‘ పోష్ లొకాలిటీలో గల ఈ భవనాలన్నీ కోస్తా తీరప్రాంత నిబంధనలను అతిక్రమించి కట్టినవేనట. ఈ భవనాల సముదాయంలో మొత్తం 343 ఫ్లాట్స్ నిర్మించగా 240 కుటంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని గత ఏడాది మే 8న సుప్రీంకోర్టు ఆదేశించింది. తొలుత ఫ్లాట్ల యజమానులు నిరసన వ్యక్తం చేశారు. కూల్చివేతను నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టుకు మొరపెట్టుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. కేరళ ప్రభుత్వం కోరిన 138 రోజుల గడువులోగా కూల్చివేయాలని గత ఏడాది సెప్టెంబర్‌లో స్పష్టం చేసింది. అలాగే ఒక్కో ఫ్లాటు యజమానికి మధ్యంతర పరిహారంగా రూ.25 లక్షలు చెల్లించాలని పేర్కొంది.