పార్టీ ఫండ్‌ ఇవ్వనందుకే టీఆర్‌ఎస్‌ నాయకుడి హత్య

By సుభాష్  Published on  12 Oct 2020 4:07 AM GMT
పార్టీ ఫండ్‌ ఇవ్వనందుకే టీఆర్‌ఎస్‌ నాయకుడి హత్య

మావోయిస్టులు రెచ్చిపోతున్నారు. కొన్ని రోజులుగా పెద్దగా లేని మావోల కార్యకలాపాలు.. ఇప్పుడు ఎక్కువైపోయాయి. ఇటీవల తెలంగాణలోకి అడుగు పెట్టిన మావోలు.. బీభత్సానికి తెగబడుతున్నారు. తాజాగా ములుగు జిల్లా వెంకటాపురం (కే) మండల బోధాపూర్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు మాడూరి భీమేశ్వరరావు (48)ను పోలీసు ఇన్‌ఫార్మర్‌ అనే నెపంతో మావోయిస్టులు హతమార్చారు.

శనివారం అర్ధరాత్రి భీమేశ్వరరావు ఇంటి తలుపులు బద్దలు కొట్టి మావోయిలు ఇంట్లోకి చొరబడ్డారు. కర్రలతో కొట్టి, కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. మృతుడి భార్య మాడూరి కుమారి తన భర్తను ఏమి చేయవద్దని ఎంత ప్రాదేయపడినా.. కనికరించని మావోయిస్టులు భీమేశ్వర్‌రావును హతమార్చారు. అయితే పోలీసు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నందు వల్లే హతమార్చినట్లు మావోలు ఘటన స్థలంలో వదిలిన లేఖలో పేర్కొన్నారు.

అలాగే మహదేవపూర్‌ మండలం పంకెనలో కాంగ్రెస్‌ నాయకుడు కమ్మల రాఘవులును 2012మే నెలలో మావోయిస్టులు ఇదే కారణంతో హత్య చేశారు. సుమారు ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు టీఆర్‌ఎస్‌ నాయకుడిని హతమార్చడం కలకలం రేపుతోంది. కాగా, ఇటీవల జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 8 మంది వరకు మావోలు హతమయ్యారు. దీనికి ప్రతీకారంగా మావోలు పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

అయితే భర్తను చంపవద్దని భార్య మాడూరి కుమారి ఎంత బలిమిలాడినా మావోయిస్టులు వినలేదని, కొందరు మావోయిస్టులు నన్ను పట్టుకునే పక్కకు తీసుకెళ్లారు. కదిలితే చంపేస్తాం అంటూ బెదిరిస్తూ కళ్ల ముందే నా భర్తను కత్తులతో పొడిచి హతమార్చారని ఆమె తెలిపింది. బయట సుమారు 20 మంది వరకు మావోయిస్టులు ఉండి, ఇంట్లోకి ఆరుగురు వచ్చారని తెలిపింది.

అయితే పోలీసులకు ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నవారికి ఇదేగతి పడుతుందని మావోలు ఘటన స్థలంలో వదిలిన లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు తమ పదవులకు రాజీనామా చేయాలని అల్టిమేటం జారీ చేశారు. అధికార పార్టీలో ఉంటూ ప్రజలను దోచుకుంటున్నారని లేఖలో మండిపటన్లు తెలుస్తోంది. తాము చెప్పినట్లు రాజీనామా చేయకపోతే వారికి ఇదేగతి పడుతుందని హెచ్చరించారు.

పార్టీ ఫండ్‌ ఇవ్వనందుకు ఈ హత్య

ఈ విషయమై ములుగు ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ పాటిల్‌ స్పందిచారు. పార్టీ ఫండ్‌ ఇవ్వనందుకు టీఆర్‌ఎస్‌ నాయకుడిపై కక్ష పెంచుకుని హతమార్చినట్లు ఆయన తెలిపారు. అర్ధరాత్రి సమయంలో సాయుధులైన ఆరుగురు మావోయిస్టులు భీమేశ్వర్‌రావుపై దాడి చేసి అతి దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేశారని, జిల్లా సరిహద్దు గ్రామాలకు చెందిన గిరిజనులను ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం చేస్తున్నారని అన్నారు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటూ రోడ్లను తవ్వి ప్రజలకు ఆటంకం కలిగిస్తున్నారన్నారు.

Next Story