నాలో కొత్తశక్తిని ఆహ్వానిస్తున్నా..!
By మధుసూదనరావు రామదుర్గం Published on 23 July 2020 5:40 AM GMTదట్టమైన అడవుల్లో నటి మనీషా
క్యాన్సర్ విజేత...తీరులో సానుకూలత
అలనాగి అందాల తార...బాలీవుడ్, టాలీవుడ్ తమిళంలో గ్లామర్ క్వీన్ గా ఓ వెలుగు వెలిగిన మనీషా కోయిరాల అనూహ్యంగా క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. ప్రాణాంతక వ్యాధి కమ్మేసినా ఏ మాత్రం కుంగిపోకుండా అత్యంత సానుకూల దృక్పథంతో ఓపికతో యుద్ధానికి తలపడింది. డాక్టర్ల సాయం...మందుల ప్రభావం...ఆత్మస్థైర్యం బాగా పనిచేశాయి. క్యాన్సర్ నుంచి బైటపడగలిగింది. ఈ క్రమంలో మారిన తన జీవనశైలికి అనుగుణంగా అప్పుడప్పుడు కొన్ని ఆసక్తికర అంశాలను సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్ లలో షేర్ చేసుకుంటుంటుంది. తాజాగా...రిగైనింగ్ ఎనర్జీ అనే కాప్షన్ తో తను దట్టమైన అడవుల్లో సంచరిస్తున్న చక్కని పిక్ లు షేర్ చేసింది. ఇప్పటి స్థితిలో నిశ్శబ్దాన్ని...ఒంటరితనాన్ని అమితంగా ప్రేమిస్తున్న ఈ 49 ఏళ్ళ తార అనాటి తన జిలుగు వెలుగుల్ని గుర్తు చేసుకుంటూ కుంగిపోవడం లేదు. ధైర్యంగా తన తాజా స్థితిగతుల్ని అందరికీ చెబుతోంది. పచ్చని ఆడవిలో ఆ ప్రశాంత ఏకాంత సమయంలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ కోకిలమ్మలా తిరగాడుతున్న మనీషా ఆంగ్ల కవి రాబర్ట్ ఫ్రాస్ట్స్ కవిత ...ద వుడ్స్ ఆర్ లవ్లీ..డార్క్ అండ్ డీప్, బట్ ఐ హ్యవ్ ప్రామిసెస్ టు కీప్, అండ్ మైల్స్ టుగో బిఫోర్ ఐ స్లీప్...అన్న అద్బుత వాక్యాన్ని జతపరుస్తూ కొన్ని చక్కని పిక్ లను పోస్ట్ చేసింది. తను తీసుకున్న ఆ సెల్ఫీలో దాచాల్సిందేమీ లేదన్న భావన స్ఫురించేలా ఉంది. వన్నెవెలిసిన తన జుట్టు ఆ సెల్ఫీలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతోపాటు తన అభిమానుల్ని ప్రశంసిస్తూ లెక్కలేనంత ప్రేమతో మీ మనీషా అంటూ మరో వ్యాక్యం జతపరిచింది.
మనిషా ఇన్‌స్టాగ్రామ్ ఎప్పుడు చూసినా సానుకూల తరంగాలే మన మనసుల్ని తాకుతుంటాయి. ఓ గదిలో ల్యాప్ టాప్ లో పనిచేసుకుంటూ ఉన్న చిత్రం చూస్తే మనీషా ఈ కరోనా నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా హోమ్ ఐసోలేషన్ మంత్రాన్ని పాటిస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ చిత్రంలో ఓ ర్యాక్ అందులో పుస్తకాల దొంతర కనిపిస్తుంది. ఈ పిక్ తోపాటు మనీషా
మిత్రులారా...మనకు ఆనందం, ప్రశాంతత ఇచ్చే వస్తువులపై ఆత్మీయభావన ఉండాలి. ముఖ్యంగా ఇలాంటి సమయాల్లో... అంటూ క్యాప్షన్ ఇచ్చింది. 2012లో మనీషాకు ఓవరిన్ క్యాన్సర్ ఉందని వైద్యపరీక్షలో బైటపడింది. ఈ అనూహ్య పరిణామానికి మొదట్లో కలతచెందినా జీవితం అంటే ఇదేగా అని తనను తాను ఓదార్చుకుని ట్రీట్ మెంట్ కు సిద్ధపడింది. తను చికిత్స తీసుకుంటున్నప్పటి చిత్రాలను పోస్ట్ చేస్తూ...నాకు లభించిన ఈ పునర్జన్మకు చిరకాల రుణిని...అంటూ వ్యాఖ్యానించింది.
క్యాన్సర్ తో తన అవి శ్రాంతపోరాడి ఎలా విజయం సాధించిందో వివరిస్తూ ఏకంగా ఓ పుస్తకంగానే రాసింది. హీల్డ్ పేరుతో 2018లో ప్రచురితమైన ఈ పుస్తకంలో క్యాన్సర్ తనకు ఓ కొత్త జీవితాన్ని ఇచ్చిన క్రమాన్ని రాసుకుంది. అలనాటి అందాల తార మనీషా నెట్ ఫ్లిక్స్ సినిమా మస్కాలో నటించింది. ఆ తర్వాత కొన్ని ఫీచర్ సినిమాలు..ప్రస్థానం, సంజులలో కనిపించింది. నెట్ ప్లిక్స్ లస్ట్ స్టోరీస్ లో కూడా యాక్ట్ చేసింది.
మనీషా ఒక నటిగా కాకుండా జీవితంలో కష్టాలను జయించిన ధీరగా మనకు కనిపిస్తోంది. మనీషా జీవితం నుంచి ఈనాటి మనుషులు ముఖ్యంగా యువతరం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. రెండ్రోజులు జ్వరం వస్తేనో...అనుకున్న ఉద్యోగం రాకుంటేనో..స్వల్పపాటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తితేనో ...కుంగిపోతుంటాం. పరీక్షలో తప్పితే...ఈ లైఫ్ వేస్ట్ అని రాసి మరీ జీవితాన్ని చాలించుకునేందుకు సిద్దమయ్యే వారు మనీషా సానుకూల శక్తిని గమనించాలి. ఒక ప్రాణాంతక వ్యాధి అనూహ్యంగా శరీరంలో ప్రవేశించి...రంగుల ప్రపంచం సినీ వెండితెరపై కుప్పలు తెప్పలుగా వచ్చిన అవకాశాల్ని లాగేసుకున్నా...ఆమె పెదాలపై చిరునవ్వును లాగేయలేకపోయింది. హ్యాట్స్ ఆఫ్ మనీషా!!
- రామదుర్గం మధుసూదనరావు