అమెరికా ప్రతినిధుల సభకు తెలుగు మహిళ పోటీ

By అంజి  Published on  9 Feb 2020 3:54 AM GMT
అమెరికా ప్రతినిధుల సభకు తెలుగు మహిళ పోటీ

న్యూయార్క్‌: అమెరికా ప్రతినిధుల సభకు తెలుగింటి ఆడపడుచు పోటీ చేయబోతోంది. 11వ కాంగ్రెస్‌ డిస్ట్రిక్ట్‌లో రిపబ్లిక్‌ పార్టీ తరఫున మంగా అనంతాత్ముల అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారైంది. త్వరలో వర్జీనియాలోని కాంగ్రెస్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి పోటీ చేస్తారు. ప్రతినిధుల సభకు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న మొదటి భారత సంతతి అభ్యర్ధిగా మంగా అనంతాత్ముల నిలిచారు. ఏపీ రాష్ట్రంలో మంగా జన్మించింది. ఆ తర్వాత చెన్నైలో పాఠశాల విద్యాభ్యాసం.. ఆగ్రా వర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. 1990లో అమెరికాకు వలస వెళ్లిన ఆమె.. అక్కడ రక్షణ కొనుగోళ్ల విభాగంలో ఫెడరల్‌ ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా పని చేశారు.

నవంబర్‌లో కాంగ్రెషనల్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఆరుసార్లు విజేతగా నిలిచిన కాంగ్రెస్‌ సభ్యుడు జెర్రీ కొన్నోలీనితో ఆమె పోటీ పడనున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విజయవంతమైన నిర్ణయాల వల్ల పెద్ద సంఖ్యలో డెమొక్రాటిక్‌ కార్యకర్తలు, నాయకులు.. రిపబ్లికన్‌ పార్టీ వైపు వస్తున్నారని మంగ పేర్కొన్నారు. వర్జీనియా శివారు ప్రాంతం హెర్నడొన్‌ నుంచి రిపబ్లికన్‌ పార్టీ తరఫున మంగా ప్రచారం ప్రారంభించారు. ప్రతినిధుల సభకు ఎన్నికైతే యూఎస్‌-భారత్‌ మధ్య సంబంధాల బలోపేతం కోసం మరింత కృషి చేస్తానని మంగా హామీ ఇచ్చారు. అయితే 11వ కాంగ్రెస్‌ డిస్ట్రిక్ట్‌లో 17 శాతం ఆసియా జనాభా ఉంది. అందులో 7 శాతం భారతీయ అమెరికన్లు ఉన్నారు. మొదటి నుంచి ఆసియా అమెరికన్లు, భారతీయ అమెరికన్లు డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థులకే మద్దతు ఇస్తు వస్తున్నారు.

ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రాట్ నేత, స్పీకర్‌ నాన్సీ పెలోసీల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. తన వార్షిక ప్రసంగం సందర్భంగా నాన్సీకి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేందుకు ట్రంప్‌ నిరాకరించటంతో ఆమె ట్రంప్ ప్రసంగ పత్రాలు చించేయటం అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. అమెరికాలో ఎస్‌ఓటీయూ2020 కార్యక్రమం జరుగుతోంది. సభ ట్రంప్ కోసం ఎదురు చూస్తోంది. అప్పుడే ఎంటర్ అయిన ట్రంప్ తన ప్రసంగానికి సంబంధించిన కాపీలను స్పీకర్ పెలోసికి అందించారు. ట్రంప్ తన ప్రసంగ కాపీలను అందిస్తున్న సమయంలో ఆయనకు ఆమె షేక్ హ్యాండ్ అందించారు. అయితే ట్రంప్ చూసి చూడనట్టుగా వెనక్కి తిరిగి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దీంతో తీవ్ర అసహనానికి లోనైన పెలోస్.. ట్రంప్ ప్రసంగ కాపీలను సభలోనే చించేశారు.

Next Story