చైనాలో మ‌రో కొత్త వైర‌స్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 March 2020 1:04 PM GMT
చైనాలో మ‌రో కొత్త వైర‌స్‌

క‌రోనా వైర‌స్‌(కొవిడ్‌-19) ప్ర‌పంచాన్ని భ‌య‌పెడుతోంది. రోజు రోజుకు ఈ మ‌హ‌మ్మారి వేగంగా విస్త‌రిస్తోంది. ఇప్ప‌టికే ఈ వైర‌స్ కార‌ణంగా 13వేల మందికి పైగా మృత్యువాత ప‌డ‌గా.. 3ల‌క్ష‌ల మందికి పైగా దీని బాధితులు ఉన్నారు. కాగా.. ఇప్ప‌టికి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారికి మందును క‌నిపెట్ట‌లేదు. ఈ వైర‌స్ మొట్ట‌మొద‌టి సారి చైనాలోని వుహాన్ న‌గ‌రంలో వెలుగుచూసింది.

ఈ వైర‌స్‌ను ఎలా అంతమొదించాల‌ని ప్ర‌పంచ‌దేశాల‌న్ని త‌ల‌లుపట్టుకుంటున్నాయి. ఈ మ‌హ‌మ్మారి పీడ విర‌గడ‌వ్వ‌క‌ ముందే.. మ‌రో కొత్త ర‌కం వైర‌స్ క‌ల‌వ‌ర పెడుతోంది. ఆ వైర‌స్‌ను కూడా చైనాలోనే క‌నుగొన్నారు. చైనాలోని యునన్ ప్రావిన్సుల్లో హంటావైరస్ లక్షణాలతో ఓ వ్యక్తి మృతిచెందాడు. షాండాంగ్ ప్రావిన్సులకు వెళ్తున్న అతడు హంటావైరస్‌తో మృతిచెందినట్టు చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. అతడు ప్రయాణించిన బస్సులోని మరో 32 మంది ప్రయాణికులకు కూడా పరీక్షలు నిర్వహించినట్టు తెలిపింది.

హంటావైరస్‌తో ఒకరు మృతిచెందడడంతో ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న మొద‌లైంది. ఇది మరో కరోనా వైరస్‌ మహమ్మారిగా విజృంభిస్తుందేమోనని భయపడిపోతున్నారు. కాగా.. క‌రోన వైర‌స్‌లా ఇది గాలిలో ఉండ‌దు. హాంటావైరస్ వ్యాధికి ఎలుకలే కారణం. ఈ వైరస్‌కు ఎలుకలు ప్రధాన వాహకాలు. ‘ఇంటిలో, చుట్టుపక్కల పరిసరాల్లో ఎలుకల ఉంటే హాంటావైరస్ వ్యాపించే ప్రమాదంగా ఉంది. ఈ వైరస్ బారిన పడితే సంపూర్ణ ఆరోగ్యవంతులకు కూడా హెచ్‌పిఎస్ ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది’ అని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పేర్కొంది.

ఈ వైర‌స్ సోకితే.. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, కడుపు నొప్పి, వికారం, వాంతులు, మైకం, విరేచనాలు, ఉదర సంబంధ లక్షణాలు ఉంటాయి. అలాగే, వైరస్ తీవ్రత ఎక్కువయ్యే కొద్దీ ఊపిరితిత్తులు కఫంతో నిండిపోయి, శ్వాసతీసుకోవడానికి ఇబ్బందిగా మారుతుంది. హంటావైరస్‌ను ఆండీస్ వైరస్ అని కూడా అంటారు. హెచ్‌పీఎస్ కూడా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. ఎలుకల లాలజలం, మూత్రం లేదా దాని వ్యర్థాలను తాకిన తర్వాత ఎవరైనా తమ కళ్లు, ముక్కు, నోటిని తాకితే అది సంక్రమిస్తుందని తెలిపింది. చిలీ, అర్జెంటీనాలో అత్యంత అరుదైన కేసుల్లోనే ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించినట్టు తేలిందని, హంటావైరస్ సోకిన వ్యక్తితో అత్యంత సన్నిహితంగా ఉన్నవారికి సంక్రమించే అవకాశాలు తక్కువగా ఉంటాయని పేర్కొంది.

Next Story