మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముటీ కథానాయకుడిగా రూపొందిన 'మధుర రాజా' చిత్రం తెలుగులో 'రాజా నరసింహా'గా అనువాదమవుతోంది. 'మన్యం పులి' (పులి మురుగన్‌) సినిమాతో విజయం అందుకున్న వైశాఖ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

జై, మహిమా నంబియార్‌ కీలక పాత్రదారులు. జగపతిబాబు ప్రతినాయకుడిగా కనిపిస్తారు. జై చెన్నకేశవ పిక్చర్స్‌ పతాకంపై సాధు శేఖర్‌ తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాని తీసుకొస్తున్నారు. అగ్ర దర్శకుడు వి.వి.వినాయక్‌ చేతులు మీదుగా ఈ చిత్రం ట్రైలర్‌ను ఆవిష్కరించారు.

ఈ సంద‌ర్భంగా వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ...

''ట్రైలర్‌ పవర్‌ఫుల్‌గా ఉంది. మలయాళంలో విజయవంతమైన ఈ చిత్రం తెలుగులో కూడా పెద్ద హిట్‌ అవుతుందన్నారు. ఈ చిత్రంతో నిర్మాతకు మంచి పేరు, లాభాలు రావాలి'' అని అన్నారు.

నిర్మాత సాధు శేఖర్‌ మాట్లాడుతూ..

''వినాయక్‌గారి చేతులమీదుగా ట్రైలర్‌ విడుదల కావడం ఆనందంగా ఉందన్నారు. చక్కని సందేశంతో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని తెరకెక్కినట్లు తెలిపారు. మమ్ముటీ పవర్‌ఫుల్‌ యాక్షన్‌తో పాటు.. ప్రతినాయకుడిగా జగపతిబాబు క్యారెక్టర్‌ అలరిస్తుందన్నారు.

గోపీ సుందర్‌ సంగీతం, సన్నీలియోన్‌ ప్రత్యేక గీతం సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయన్నారు. మలయాళంలో వంద కోట్లు వసూలు చేసి ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు. 'యాత్ర' లాంటి సూపర్‌హిట్‌ తర్వాత మమ్ముటీ నుంచి వస్తున్న మంచి చిత్రమిది. దీనికి అనువాద కార్యక్రమాలు పూర్తయిపోయింది. ఈ నెల 22న సినిమాను విడుదల చేస్తున్నాం'' అని అన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story