మహా శివరాత్రి.. ఉపవాసం, జాగరణ ఎలా చేయాలి ?

By రాణి  Published on  20 Feb 2020 5:44 AM GMT
మహా శివరాత్రి.. ఉపవాసం, జాగరణ ఎలా చేయాలి ?

శివ అంటే ఆది గురువు అని అర్థం. అలాంటి ఆది గురువుకి వివాహం జరిగిన రోజు, ఆది గురువు లింగాకారంలో ఆవిర్భవించిన రోజును హిందువులు ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు. మహా శివరాత్రి..! శివ - పార్వతులకు కల్యాణం జరిగిన రోజు, శివుడు లింగాకారంగా ఆవిర్భవించిన రోజు అని శివపురాణం చెబుతోంది. చాంద్రమాన నెలల లెక్కింపు ప్రకారం మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి నాడు(మాఘ బహుళ చతుర్దశి) వచ్చే ఈ పండుగను హిందువులు ఎంతో భక్తి, పారవశ్యాలతో జరుపుకుంటారు. 11 నెలలు మాస శివరాత్రి వస్తే..12వ నెలలో వచ్చే శివరాత్రిని మహా శివరాత్రిగా జరుపుకుంటారు భక్తులు.

మహా శివరాత్రి రోజు భక్తులు నియమ, నిష్టలతో ఉపవాసం చేసి, జాగరణ చేస్తారు. అలా చేస్తే పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. అలాగే శివుడికి ఇష్టమైన బిల్వ పత్రాలతో అర్చన, పంచతీర్థాలతో అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ రోజున దేశంలో ఉన్న అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. మహా శివరాత్రి రాత్రి సమయంలో శివ కల్యాణం కన్నుల పండువగా జరుగుతుంది. జాగరణ కోసం వివిధ ఆలయాల్లో శివపురాణ హరికథలు, నాటకాలు నిర్వహిస్తుంటారు. అలాగే మనం ఆలయాల్లో పెట్టుకునే విభూతిని కూడా ఈ రోజే చేస్తారు. ఎందుకంటే మహా శివరాత్రి అంటే..అంత పవిత్రంగా భావిస్తారు కాబట్టి. శివరాత్రి రోజు మహా మృత్యుంజయ మంత్రాన్ని ఎక్కువగా పఠిస్తుంటారు. మహా శివరాత్రిరోజున నియమ, నిష్టలతో ఉపవాసం చేసి..జగమేలెడి తండ్రిని కొలిస్తే కోరిన కోరికను తీరుస్తాడన్నది శివ భక్తుల విశ్వాసం.

కేవలం భారతదేశంలోనే కాకుండా..ఇతర దేశాల్లో ఉండే హిందువులు కూడా శివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు. నేపాల్ లోని పశుపతినాథ్ ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు హాజరై..శివ దర్శనం చేసుకుంటారు. పవిత్ర బాగమతి నదిలో స్నానమాచరించి ఆలయం మొత్తం దీపపు కుందులను ఏర్పాటు చేస్తారు. అలాగే బంగ్లాదేశ్ లో కూడా శివరాత్రిని ఘనంగా జరుపుకుంటారు. అక్కడ ఉపవాసం అంటే..ఆశతో ఉపోషం ఉండేందుకు చిట్టగాంగ్ వెళ్తారు. మహా శివరాత్రి రోజు ఉపవాసం ఉండి..శివుడిని పూజిస్తే మంచి జీవిత భాగస్వామి వస్తారని అక్కడి భక్తుల నమ్మకం.

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీ మహాకాళేశ్వర్ ఆలయంలో మహా శివరాత్రి అత్యంత వైభవంగా జరుగుతుంది. భారతదేశంలో ప్రాచుర్యం పొందిన శివ క్షేత్రాల్లో ఇది ఒకటి. శివస్వాములు, భక్తులు రాత్రంతా అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తారు.

కాశీలో మహా శివరాత్రి పర్వదినం వైభవంగా జరుగుతుంది. కాశీలో ఉండే అఘోరాలు, సాధువులు శివరాత్రిని ఘనంగా జరుపుకుంటారు. లింగాకారంలో ఉండే శివుడికి అభిషేకాలు నిర్వహిస్తారు. పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. కాశీ విశ్వేశ్వరుడికి, దేవేరికి జరిగే కల్యాణాన్ని తిలకించేందుకు అక్కడుండేవారే కాకుండా..దేశ నలుమూలల నుంచి భక్తులు తరలి వెళ్తారు.

ఉపవాసం, జాగరణ

తెలుగు రాష్ర్టాల్లో, కర్ణాటక, కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో మహా శివరాత్రి పర్వదినం అత్యంత వైభవంగా జరుగుతుంది. ప్రతి ఇంట్లో ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటుంటారు. కొంతమంది తమ ఇళ్లలోనే శివ కల్యాణం చేసి..వచ్చిన అతిథులకు భోజనాలు వడ్డిస్తుంటారు. శివరాత్రి రోజు ఉపవాసం చేయడం అంటే..రోజంతా నీరు కూడా ముట్టకుండా..సాయంత్రం శివాలయానికి వెళ్లి శివదర్శనం చేసుకున్నాక పళ్లు, ఉడకబెట్టిన కూరగాయలు తింటుంటారు. అదే రోజు రాత్రి జాగరణ చేసి మర్నాడు కడుపునిండా భోజనం చేస్తారు..

ఉపవాసం చేసే పద్ధతి ఇది కాదు. ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండటం. అంటే ఉపవాసం చేసేవారు భగవంతుడి నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. అలా ఉండేవారికి ఉపవాసం చేస్తున్నామన్న ఆలోచన గానీ..ఎప్పుడు తెల్లవారుతుందా..ఎప్పుడు తిందామా అన్న ఆసక్తి గానీ ఉండవు. నిజానికి మహా శివరాత్రి రోజు ఉపవాసం ఉండేవారు ఉమ్మి కూడా మింగకూడదు. నీరు తాగకూడదు అని చెప్తారు. కానీ..భగవంతుడు మనుషులు ఇలాగే ఉపవాసం చేయాలన్న కండిషన్లేమీ పెట్టలేదు. ఇవన్నీ మనం పెట్టుకున్నవే. మహా శివరాత్రి రోజు కటిక ఉపవాసం చేయాలన్న నియమం లేదు. ఉపవాసం చేసే వారు..నీరు తాగొచ్చు..మన గొంతులోకి వచ్చే ఉమ్మిని కూడా ఊసివేయనక్కర్లేదు. ఉపవాసం చేసేవారిలో బీపీ పేషెంట్లెవరైనా ఉంటే గ్లాసు నీటిలో ఉప్పు కలుపుకుని తాగొచ్చు. లేదు నీరసంగా ఉందనుకుంటే ఎవరి అలవాటు ప్రకారం వారు..కాఫీ లేదా టీ తాగొచ్చు. సాయంత్రం యథావిధిగా పళ్లు తినొచ్చు. గుర్తు పెట్టుకోండి..ఆకలికి ఉండలేని వారు కూడా ఉపవాసం చేయాలని దేవుడు ఏ పురాణాల్లోనూ చెప్పలేదు.

అలాగే శివరాత్రి జాగరణ అంటే..సిటీ కల్చర్ కు అలవాటు పడిన చాలా మంది సినిమాలు చూస్తూ గడిపేస్తుంటారు. శివనామస్మరణ చేస్తూ..మెలకువతో ఉండేదానిని జాగరణ అంటారు. దేవాలయాల్లో లేదా భక్తు సినిమాలు చూస్తూనో జాగరణ చేయాలి గానీ..ఏది పడితే అది చూస్తూ జాగరణ చేస్తే అది నైట్ అవుట్ అవుతుంది తప్ప శివరాత్రి జాగరణ కాదు.

Next Story